ఆయన 58 ఏండ్ల కుర్ర తాతయ్య. తెలుగులోనూ, ఇతర భాషలలోనూ ఉన్న మంచి సైట్ లను పరిచయం చేయడం, సాహిత్యపరమైన వ్యాసాలతో పాటు తాను స్పందించదలచుకున్న విషయాలపై సరదా-సరదాగా.........గరం-గరంగా వ్యాఖ్యానించే 'సాహిత్య అభిమాని' బ్లాగరు కప్పగంతు శివరామప్రసాదు గారితో 'పల్లెప్రపంచం' జరిపిన ఇంటర్వ్యూ ఇది. బ్లాగరుగా అనుభవాలతో పాటు వివిధ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. బ్లాగు ప్రపంచంలో కొత్తవారికి సైతం ప్రేరణ గా ఉంటున్న ప్రసాదు గారిలో సృజనాత్మకత ఎక్కువంటే, "కొద్ది విషయాలలో పరిజ్ఞానం ఉన్న దానినే సృజనాత్మకత అనడాన్ని నేను అంగీకరించను" అంటారాయనఈ రోజు 58 వ వసంతంలోకి అడుగుపెడుతున్న ప్రసాదు గారికి పల్లెప్రపంచం తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎవరు అంగీకరీంచినా, అంగీకరించకపోయినా ఆయన తన అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టినట్టు చెప్పగలరు. ఇతరులూ అలాగే ఉండాలని కోరుకుంటారు. నంగిరిగా, అతి వినయంతో మాట్లాడే వాళ్ళను దగ్గరికి రానివ్వను అంటున్న ప్రసాదు గారు వివిధ ఇతర అంశాలపై వెలిబుచ్చిన అభిప్రాయాలను చదవండి ............


ప్ర - మీ పేరు?
జ - నా పేరు శివరామప్రసాదు, ఇంటిపేరు కప్పగంతు. పూర్తిపేరు శివరామప్రసాదు కప్పగంతు.  

ప్ర - మీ పుట్టిన తేది, వయస్సు?
జ - జూన్ 2 1958

(ఇది ప్రసాద్ గారి నాన్నగారి డైరీ పేజీ స్కాన్ చేసినది. ఎవరికైనా చిన్ననాటి జ్ఞాపకాలు పదిలంగా భద్రపరచుకోవడం జీవితాంతం ఆనందకరమైన విషయం. అప్పట్లో చాలామంది తల్లిదండ్రులు పిల్లల జన్మతేదీలు భద్రపరచకపోయేది. ఈ విషయంలో ప్రసాద్ గారు అదృష్టవంతులనే చెప్పాలి. ఆ పేజీలో  ఆయన పుట్టిన రోజునే వారి నాన్నగారు ఆయన పేరును డైరీ పేజిపైన వ్రాసేశారు. పైన పేరు 'చిరంజీవి శివరామ ప్రసాద్' అని వ్రాసి ఉన్నది గమనించవచ్చు. డైరీలో ఖర్చుల వివరాలు కూడా కనపడుతున్నాయి. అప్పట్లో జమా ఖర్చులు కూడా చాలా వివరంగా వ్రాసుకునేవారు. ఆరోజున ఆయన పెట్టిన ఖర్చు 44 రూపాయలు అందులో ముందు నెల పాల బిల్ 23 రూపాయలు)

ప్ర - మీ తల్లిదండ్రుల వివరాలు?
జ - మా నాన్నగారి పేరు వెంకట లక్ష్మీ నరసింహం, గన్నవరం దగ్గర ఉన్న వెన్నూతల వారి స్వగ్రామం.
      మా అమ్మగారి పేరు వెంకట సుబ్బమ్మ, ఉయ్యూరు దగ్గిరలో ఉన్న శాయపురం స్వగ్రామం.
      పై రెండు గ్రామాలూ కృష్ణా జిల్లా - ఆంధ్ర రాష్ట్రం.
My Parents

ప్ర - మీ జన్మస్థలం?
జ - విజయవాడ,  అప్పట్లో పేరొందిన  జానకీబాయ్ గారి ఆసుపత్రిలో.

ప్ర - ప్రస్తుత నివాసం?
జ - వృత్తి రీత్యా ముంబాయి నగరం.

ప్ర - విద్యార్హతలు - విద్యాభ్యాసం వివరాలు?
జ - విద్యార్హతలు పెద్దగా ఏమీ లేవు. అందరిలాగానే 10వ తరగతి వరకూ చదివాను, లోకం పోకడ దృష్ట్యా కామర్స్ సబ్జేట్ తీసుకుని (సి.ఇ.సి) బాచులర్ ఆఫ్ కామర్స్ 1978 లో పూర్తి చేశాను. అవసరం దృష్ట్యా,  బాంకింగ్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమా CAIIB, ఇండియన్ ఇన్స్టిట్యూట్ బాంకర్స్ నుండి చేశాను. ఆసక్తితో సాయంత్రం కాలేజీ లో చేరి, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి లా డిగ్రీ 2002 లో పూర్తిచేశాను.

ప్ర - మీ వివాహం, ఇతర కుటుంబ వివరాలు?
జ- మా వివాహం పెద్దలు కుదిర్చినది. 1981 నవంబరు ఒకటిన విజయవాడలో జరిగింది. మాకు ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరూ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. పెద్దాబ్బాయి లండన్ లో ఇనోఫోసిస్ లో పనిచేస్తున్నాడు. రెండో అబ్బాయి, ముంబాయిలో క్రెడిట్ స్విస్ బాంకులో పనిచేస్తున్నాడు. ఇద్దరికీ వివాహం అయింది, పెద్దబ్బాయికి ఒక కూతురు,రెండో అబ్బాయికి ఒక కూతురు.

ప్ర - మీ ఉద్యోగ వివరాలు?
జ - పెద్ద ఉద్యోగం ఏమీ కాదు, ఒక ప్రభుత్వ బాంకులో మానేజరుగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం ఆ బాంకు విదేశ వాణిజ్య విభాగ నియమ నిబంధనలను, పద్ధతులను నియంత్రించే విభాగంలో ఉన్నాను.

ప్ర - మీ హాబీస్  ?
జ - నా మొట్టమొదటి హాబీ పుస్తకాలు చదవటం. ప్రస్తుతం కాస్త కుంటుపడినా స్టాంపుల సేకరణ ఒక పెద్ద హాబీ. ప్రస్తుతం చాలా చురుకుగా పాల్గొంటున్న హాబీ హ్యాం రేడియో ఆపైన బ్లాగులో వ్రాయటం. ఈ మధ్యనే ఫేస్ బుక్ లో కూడా చురుకుగా ఉంటున్నాను.

ప్ర - మీకు ఇష్టమైన ఆహారం?
జ - పూర్తి  శాకాహారం.

ప్ర - జీవితంలో అన్నింటికన్నా ముఖ్యమైనది ఏది?
జ - తృప్తి. తృప్తి లేని జీవితం,  జీవితమే కాదు.

ప్ర - మీ జీవితంలో అన్నింటికంటే ముఖ్యమైనదేది అంటే ఏమి చెప్తారు?
జ - నా దృష్టిలో తృప్తి కి మించినది జీవితంలో లేదు. అది ఒక్కటి సాధించినవాడు అన్నీ సాధించినట్టే. తృప్తి లేని జీవితం ఎన్ని సాధించుకున్నా ఇంకా ఎదో లేదు అని వెంపర్లాడటంతోనే సరిపోతుంది. ప్రతి వాళ్ళూ తృప్తి లేకుండా ఇంకా ఇంకా ఎదో ఎదో కావాలని పరుగులు పెడుతుంటే సమాజంలో పోటీ పెరిగిపోయి స్పర్ధలు వచ్చేస్తాయి. తృప్తిలేని వాళ్ళు ఎక్కడ ఎక్కువ ఉంటారో అక్కడే అల్లరి, ఆగం ఎక్కువగా ఉంటుంది. అలా అని పొద్దున్న ఒక భోజనం రాత్రి ఒక భోజనం సంపాయించుకుని పార్కులో పడుకోమనటం లేదు! మన సామర్ధ్యం ఏమిటో మనకు తెలిసి ఉండాలి. ఆ సామర్ధ్యానికి సరిపొయ్యే విధంగా మన ఆశలు కూడా ఉండాలి తప్ప ఆకాశానికి నిచ్చెనలు వేసుకుంటూ, మనకు అర్హత లేకపోయినా, అవి సంపాయించుకునే సామర్ధ్యం లేకపోయినా వాటికోసం చెయ్యరాని పనులు చేస్తూ ఉంటేనే సమాజంలో రకరకాల అల్లర్లు మొదలవుతూ ఉంటాయి. దీనికి తప్పకుండా కావలిసినది, మన సామర్ధ్యాన్ని మనం సవ్యంగా అంచనా వేసుకోగాలగటం, అది చేతయినవాడు హాయిగా ఉంటాడు, లేనివాడు నా నా అల్లరిగా బతుకుతూ ఉంటాడు..మనం చేసే పని మనం చేస్తూ ఉంటాము, మనకు దక్కిన దాంతో తృప్తిగా ఉంటే, మనకూ హాయి, మన కుటుంబమూ సుఖంగా ఉంటుంది. 

ప్ర - మీకు ఇతరులలో నచ్చేవి ఏవినచ్చనివి ఏవి?
జ - ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వాళ్ళంటే ఎక్కువ ఇష్టం.  నంగిరిగా, అతి వినయంతో మాట్లాడే వాళ్ళను దగ్గరికి రానివ్వను.

ప్ర - మీలో మీకు నచ్చేవి ఏవినచ్చనవి ఏవి?
జ - నాలో నచ్చేవి ఇతరులు చెప్పగలరు కాని నాకు నేనుగా చెప్పలేను. నాలో నాకు నచ్చనిది ప్రధమ కోపం, తాటాకు మంటలాగా వచ్చేస్తుంది. కొన్ని సార్లు తరువాత బాధపడతాను. కాని అలా గత ఐదున్నర దశాబ్దాలుగా జరిగిపోతున్నది.

ప్ర - మీ రోల్ మోడల్ ఎవరు?
జ - ఇలా ఉండాలి, ఫలానా వారిలాగా ఉండాలి అని పెద్దగా అనుకున్న  సందర్భాలు లేవు.

ప్ర - మీకు నచ్చే వృత్తి?
జ - జస్ట్ రెండు సంవత్సరాల్లో నేను నాకు నచ్చిన వృత్తి లోకి వెళ్ళిపోతాను. అదేమిటి అంటారా! అరవై ఏళ్ళు నిండుతాయి రిటైర్ అయిపోతాను. అంతకు మించిన అద్భుత వృత్తి లేదు.  ఇప్పుడున్న ఉద్యోగం కాకుండా మరే ఉద్యోగం చేసి ఉంటే అని ఆలోచిస్తే, బోధనా వృత్తి అయతే ఎంతయినా బాగుండేది అని ఇప్పుడు అనిపిస్తున్నది. రిటైర్ అయిన తరువాత వీలయితే లాయర్ ప్రాక్టీసు చెయ్యాలని, లా బోధించటానికి ప్రయత్నించాలని ఉన్నది.

ప్ర - మీరు డిప్రెషన్ కు గురైనప్పుడు రీచార్జ్ కావడానికేమి చేస్తారు?
జ - డిప్రెషన్ అనేది  తక్కువ. మనం ఎదుర్కునే ప్రతి ప్రతికూల పరిస్థతిని ఆలోచించి సాల్వ్ చేసుకుంటూ పొతే డిప్రెషన్ ఉండదు. ఎదో కష్టం వచ్చేసింది అని కుంగి పోయి కూచుంటే డిప్రెషన్ కు అదే దారి. అలా కాకుండా ఉండాలి అంటే హాస్యానికి మించిన మందు లేదు.

ప్ర - మీ లక్ష్యం ఏమిటి?
జ - హాయిగా తృప్తిగా బతకటం.

ప్ర - మీ బ్లాగుల పేర్లు?
జ - మొట్టమొదటి బ్లాగు సాహిత్య అభిమాని, రెండవ బ్లాగు “నా ఫోటోలు”, మూడవ బ్లాగు “ఊమెన్ కార్టూన్లు”.  కొంతకాలం “అలనాటి చందమామ” అనే బ్లాగును కొంతమంది చందమామ అభిమానులతో కలిసి నడిపాను. ఆసక్తి తక్కువైపోయిన కారణాన ఆ బ్లాగులో ఉన్న విశేషాలు సాహిత్య అభిమానిలో కలిపేశాను.

సినీ కళాకారుల గురించి వ్రాయటానికి కావలిసినన్ని పత్రికలు ఉన్నాయి, నాటక కళాకారుల గురించి పుస్తకాలు వచ్చినాయి. కాని నాకు ఎంతో అభిమానం ఉన్న  రేడియో కళాకారుల గురించి ఎవరూ వ్రాసిన దాఖలాలు లేవు. రేడియో కళాకారుల గురించి వ్రాద్దామని “రేడియో అభిమాని” పేరుతొ ఒక బ్లాగు ఏర్పరిచి, రేడియో కార్యక్రమాలు, కళాకారుల గురించి వ్రాయటం మొదలు పెట్టాను కాని, ఎక్కువకాలం కొనసాగించ లేకపోయాను. రేడియో కళాకారుల గురించి సమాచారం దొరకటం చాలా కష్టం అయిపోయింది. ఈ బ్లాగు విశేషాలు కూడా నా మొదటి బ్లాగు ‘సాహిత్య అభిమాని’ లో కలిపేశాను. ఇప్పటికైనా సరే రేడియో కళాకారుల గురించిన వివరాలు సంపాయించటానికి కృషి కొనసాగిస్తున్నాను. వివరాలు దొరికితే సంతోషంగా నా బ్లాగులో వ్యాసం వ్రాస్తాను. ఈ ఇంటర్వ్యూ చదివే వారిలో ఎవరికన్నా రేడియో కళాకారులు బంధువులు,స్నేహితులు, తెలిసినవారు ఉన్నవారు దయచేసి వారి వారి వివరాలు పంపగలరు.

ప్ర - మీ బ్లాగు కు 'సాహిత్య అభిమానిఅని పేరు పెట్టడానికి కారణం ఏమిటి?
జ - నాకు సాహిత్యం మీద ఉన్న అభిమానమే!



సాహిత్య అభిమాని బ్లాగు గురించి మరికొంత సమాచారం:

మొత్తం వ్యాసాలు                                                                605  
వ్యాఖ్యలు                                                                      1836
మొత్తం వీక్షణలు                                                           132619 
బ్లాగును ప్రత్యేకంగా అనుసరిస్తూ చూస్తున్న వారు                               162 

ఏ దేశాలనుండి ఎక్కువగా చూస్తున్నారు అని చూస్తె: టాప్ 10 , భారత దేశం, అమెరికా, రష్యా, జర్మనీ, ఇంగ్లాండ్,కెనడా, సింగపూర్, ఉక్రెయిన్, యు ఎ యి, ఆస్ట్రేలియా. ఇందులో 53% వీక్షణలు భారత దేశం నుండి కాగా, 30% అమెరికా నుండి. 20% మిగిలిన దేశాల నుండి


ప్ర - మీ బ్లాగుల లక్ష్యం ఏమిటి?
జ - నాకు తెలిసినది నాబ్లాగులో వ్రాద్దామన్న అభిప్రాయం. ముఖ్యంగా పెద్దగా తెలియని తెలుగు బ్లాగుల గురించి వ్రాద్దామని కోరిక. అందుకనే నా బ్లాగులో ఎక్కువగా ఇతర వెబ్ సైట్లు, బ్లాగుల గురించిన వివరాలు ఉంటాయి. అలాగే సాహిత్యం మీద అభిరుచి ఎక్కువ. ఆ కోణంలో కూడా వ్రాద్దామని కోరిక. కాని నాకు సంతృప్తి కరంగా సాహిత్యం మీద ఇంకా వ్రాయలేదు.  ఎవరన్నా అసంబధ్ధ విషయాలు వ్రాసినా, నాదృష్టిలో చెయ్యకూడని పనులు చేసినా విమర్శలు నా బ్లాగులో వ్రాస్తూ వస్తున్నాను.

ప్ర - మీకు బ్లాగు వ్రాయాలని కోరిక ఎలా కలిగింది?
జ - అనుకోకుండా జరిగిన సంఘటన.  గూగుల్ చూస్తూ “బ్లాగు తయారు చెయ్యండి” అని కనపడినది నొక్కాను. బ్లాగుకు పేరు అడిగింది. వెంటనే నాకు తట్టిన “సాహిత్య అభిమాని” వ్రాసి బ్లాగు తయారు చేశాను. పైన చెప్పినట్టుగా తెలుగులో ఉన్న మంచి మంచి బ్లాగులు, వెబ్ సైటులు అందరికీ తెలియచేద్దామని మొదలు పెట్టాను. నా మొట్టమొదటి వ్యాసం చాలా చిన్నది. సురస.నెట్ www.surasa.ne ) అన్న చక్కటి వెబ్సైటు గురించి వ్రాశాను. అప్పటికి నాకు బ్లాగు ఆగ్రిగేటర్లు ఉంటాయి అని కూడా  తెలియదు. అలా మొదలుపెట్టిన బ్లాగును మెల్లి మెల్లిగా అందాలు చెక్కుతూ రకరకాల ఫీచర్స్ కలుపుతూ ఇప్పటి రూపానికి తీసుకు వచ్చాను.

ప్ర -  మీ బ్లాగు అనుభవాలు?
జ - పెద్దగా ఏమీ లేవు. నా పంథాలో నేను వ్రాసుకుంటూ ఉంటాను. ఇష్టమైన వాళ్ళు మెచ్చుకుంటారు, కష్టమైనవాళ్ళు వారి వారి విమర్శలు వ్రాస్తూ ఉంటారు.  విమర్శలకు నాకు తోచిన విధంగా సమాధానాలు ఇస్తూ ఉంటాను.

ప్ర -  బ్లాగర్ గా ఎదురైన ఆటంకాలు ఏమిటి?
జ - ఆటంకాలు అంటూ నేను ఎదురుకున్నది లేదు. కాకపొతే కష్టపడి ఎంతో వెతికి వివరాలు తెచ్చి వ్రాసిన వ్యాసాలకు ఎవ్వరూ స్పందించనప్పుడు కొంత నిరుత్సాహం కలిగినమాట వాస్తవం.

ప్ర - బ్లాగర్ గా మీ అనుభవాలు?
జ - "బ్లాగులోకంలోకి వచ్చిన కొత్తల్లో ఎక్కువ వ్యాఖ్యలు వ్రాసిన బ్లాగు ఎ పి  మీడియా కబుర్లు. ఆ బ్లాగు అధినేత రాము గారు మంచి స్నేహితుడు అయ్యారు.నేను వ్రాసిన కొన్ని వ్యాఖ్యలను ఆయన తన బ్లాగులో వ్యాసాలుగా ప్రచురించి ప్రోత్సహించారు. వారి బ్లాగుకు లింకు http://apmediakaburlu.blogspot.in/ . 2010 లో నేను హైదరాబాదు  వచ్చినప్పుడు రాము, వేణు, రచన శాయి గార్లు  నేను మా బాంకు గెస్ట్ హౌస్ లో కలుసుకున్నాము.  అప్పటి ఆ చక్కటి జ్ఞాపకాలను నా బ్లాగులో మూడో అద్భుతం పేరుతో పంచుకున్నాను. 
బ్లాగు మిత్రులు రాము, వేణు, రచన శాయి లతో 
చందమామ పత్రిక గురించి వ్రాసిన వ్యాసాలూ అన్నీ కూడా నాకు చాలా ఆనందాన్నివటమే కాకుండా ఎందరో మిత్రులను సంపాయించుకునే అవకాశం కల్పించింది. ఫణి (http://blogaagni.blogspot.in/ ), రాజశేఖర రాజుగారు (ఈయన తెలుగు చందామామ చివరి సంపాదకుడు) ఈ మధ్యదాకా 'చందమామ చరిత్ర' అనే బ్లాగు నిర్వహించారు. ఈ బ్లాగు ప్రస్తుతం అందుబాటులో లేదు. ఈ  బ్లాగు బాక్ అప్ నా దగ్గర ఉన్నది. ఆసక్తి ఉన్నవారికి పంపగలను. అలాగే కొమ్మిరెడ్డి శ్రీనివాస్, దాసరి వెంకట రమణ గారు (ఈయన చందమామ కథల మీద రిసెర్చ్ చేస్తున్నారు), విశాఖపట్టణం నుంచి రాధేశ్యాం (http://radhemadhavi.blogspot.in/ ). ఈనాడులో పనిచేస్తున్న వేణు గారు (http://venuvu.blogspot.in/ ). మా తమ్ముడు కప్పగంతు రాధాకృష్ణ కూడా బ్లాగులోకంలోకి అడుగుపెట్టాడు. అతని బ్లాగు “ఇదీ చదవండి”(http://ideechadavamdi.blogspot.in/ ) నామకరణం, లోగో నేను డిజైన్ చేశాను. ప్రస్తుతం చాలా చక్కగా వ్రాస్తున్న ఒక బ్లాగుగా మా తమ్ముడి బ్లాగు కూడా ఉండటం నాకు ఆనందం కలిగించే విషయం.  అన్నిటికన్నా ఆనందకరమైన విషయం ఏమంటే ఇలా బ్లాగులో చందమామ గురించి వ్రాస్తుండగా, ప్రముఖ సాహిత్య మాస పత్రిక “రచన” సంపాదకులు శ్రీ సాయి గారి దగ్గర నుండి వారు వారు తీసుకు వస్తున్న “దాసరి సుబ్రహ్మణ్యం” ప్రత్యెక సంచికలో నన్ను వ్యాసాలూ వ్రాయమని ఆహ్వానం అందటం. మిగిలిన చందమామ పిచ్చోళ్ళుతో(చం.పిలు) కలిసి నేనుకూడా వ్యాసాలూ వ్రాయటం అవన్నీ కూడా రచన పత్రికలో ప్రముఖంగా ప్రచురించబడటం నా బ్లాగు అనుభవాల్లో హైలైట్.

అదేవిధంగా నాకు కార్టూనిస్టులు అంటే ఎంతో మక్కువ. ముఖ్యంగా కొలను వెంకట దుర్గా ప్రసాద్ గారు (బాబు పేరుతొ కార్టూన్లు వేస్తూ ఉంటారు), జయదేవ్ గారి కార్టూన్లు అంటే ఎంతో ఇష్టం.  ఇలా వ్రాస్తూ ఉండటం వల్లనే వారితో పరిచయం కలిగింది.  బాబు గారి బ్లాగు తయారు చెయ్యటం మొదట్లో ఆయనకు సహకరిస్తూ వారి కార్టూన్ లను వారి బ్లాగులో ప్రచురించటం చేసాను. ఇప్పుడు ఆయన నేర్చుకుని తన బ్లాగు తానె నిర్వహిస్తున్నారు. ఆయన 1970 లలో ప్రచురించిన కార్టూన్ సీరియల్ “వెంకన్నాస్ కోల్డ్” ను ఆయన బ్లాగులో ధారావాహికగా పునః ప్రచురించటం ఎంతైనా ఆనందాన్నిచ్చింది. బ్లాగుల్లో ఒక కార్టూన్ సీరియల్ రావటం అదే ప్రధమం. విజయవాడ వెళ్ళినప్పుడల్లా బాబు గారిని కలుస్తూ ఉంటాను.



జయదేవ్ గారు నా మీద ప్రేమతో నా “కారికేచర్” గీసి పంపారు. నాకు ఆ మెయిల్ చూసుకున్న తరువాత ఎంతైనా ఆనందం కలిగింది.నా బ్లాగు లోగోలో ఆయన వేసిన నా కారికేచర్ వాడుకుంటున్నాను. జయదేవ్ గారిని వారింట్లో 2010 లో కలుసుకున్నాను.


జయదేవ్ గీసిన కేరికేచర్

ఈ మధ్య అంటే రెండు మూడు నెలల క్రితం ప్రముఖ పాత్రికేయుడు, సీనియర్ సంపాదకుడు, ప్రస్తుతం ఫ్రీ లాన్స్ కాలంస్  వ్రాస్తున్న వీరాజీ గారితో పరిచయం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.  వారిని గత వారం (మే 2015) వారింట్లో కలుసుకున్నాను.

ప్ర - తెలుగు బ్లాగర్లకు మీరిచ్చే సలహాలు ఏమిటి?
జ - ఆలోచించి వ్రాయండి, అనవసర విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వద్దు, వాక్ స్వాతంత్ర ఉన్నది కదా అని ఏది పడితే అది వ్రాయటం సమంజసం కాదు. వ్రాసే విషయం వల్ల భారత దేశ సమగ్రతకు భగంకలగకూడదు. వ్రాస్తున్న విషయం మీద కూలంకషంగా తెలుసుకుని, అన్ని కోణాలనుంచి ఆలోచన చేసి వ్రాస్తే, వ్రాసిన విషయానికి సార్ధకత.  ఒకే విషయం మీద పిడివాదపు వ్రాతలు, విద్వేషాన్ని రెచ్చగొట్టే వ్రాతలు ఎక్కువకాలం నిలవవు, ఎవరూ చదవరు కూడా!

ప్ర - మీ బ్లాగు పోస్టులలో మీకు నచ్చినవి?
జ - అన్ని వ్యాసాలూ నాకు ఇష్టమే. కాకపొతే కొన్ని వ్యాసాల మీద ఎక్కువ ఇష్టం. నా బ్లాగులో నాకు బాగా నచ్చిన వ్యాసాలు కొన్నిటిని ఉదహరిస్తాను



ప్రముఖ రచయిత శ్రీ కొడవటిగంటి కుటుంబరావు గారి శతజయంతి సందర్భంగా వ్రాసిన వ్యాసం. వారి అబ్బాయి శ్రీ రోహిణీ ప్రసాద్ గారు “మీరు సమగ్రంగా వ్రాశారు” అని మెచ్చుకున్న వ్యాసం

శ్రీ శంకరమంచి సత్యం గారి ప్రపంచ ప్రఖ్యాత అమరావతి కథల గురించిన నా చిరు సమీక్ష.
నాకు నచ్చిన సాహిత్య ప్రక్రియల గురించి వ్రాసిన వ్యాసాలు

నా చిన్నతనంలో ఎన్నో సినిమాలు చూసిన లీలామహల్ పడగోట్టేసారు అని తెలిసినప్పుడు పాత విషయాలు నెమరువేసుకుంటూ వ్రాసిన వ్యాసం

మనది ప్రజాస్వామ్యం కదా, మనల్ని పరిపాలించాల్సింది ప్రజా ప్రతినిధులు కాని అధిష్టానాలు, పాలిట్-బ్యూరోలు కాదు.
వ్యాపార ప్రకటనా  కాలుష్యం గురించిన వ్యాసాలు
తెలుగులో కొత్త పదాల సృష్టి  అన్న విషయం  మీద నా అభిప్రాయాలు
వినాయకచవితి పేరుతొ జరుగుతున్నా బజారు/భ్రష్ట పూజల గురించిన వ్యాసాలు 
నాకు నచ్చిన ప్రముఖ కార్టూనిస్టుల గురించిన వ్యాసాలు 
ఒక సమస్యను పరిష్కరించబోయి మరింత జటిల సమస్యను తెచ్చిపెట్టిన గుమాస్తాల తెలివి

ప్ర - ఇతర బ్లాగులలో మీకు నచ్చినవి?
జ - నాకు నచ్చిన బ్లాగులు అంటే చాలా ఉన్నాయి :

చందు S రచనలు (http://sailajachandu.blogspot.in/) బ్లాగులో డాక్టర్ శైలజ గారు చాలా చక్కటి శైలిలో వ్రాస్తున్నారు. వారి కథల్లో ఉన్న హాస్యం చాలా బాగా నచ్చింది నాకు. 

అలాగే చాలా పరిశోధన చేసి వ్రాస్తున్న శ్రీ సుబ్రహ్మణ్య చైతన్య గారి బ్లాగు “స్వర్ణ ముఖి” కూడా నాకు అభిమాన బ్లాగు (http://swarnmukhi.blogspot.in/ ). ఈయన చైనా యుద్ధం గురించిన అద్భుత వ్యాస పరంపర వ్రాసి ధారావాహికగా ప్రచురించారు, అలాగే సీతారామరాజు గురించిన అనేక తెలియని విషయాలు వ్రాశారు.


ప్ర - బ్లాగులలో మనం కష్టపడి లేదా ఇష్టపడి వ్రాసిన వాటికి తగిన గుర్తింపు రానపుడు ఎలా విశ్లేషించుకోవాలి?
జ -గుర్తింపు కోసం మాత్రమె వ్రాస్తుంటే కష్టం. బ్లాగుల్లో వ్రాసుకోవటం మనకు ఇష్టం కాబట్టి వ్రాస్తున్నాము. అంతకంటే ఎక్కువ అనుకుంటే నిరుత్సాహం తప్పదు. మనకు ఇష్టం కాబట్టి వ్రాస్తూ ఉండటమే.

ప్ర - మీరు అజ్ఞాతలను ఇష్టపడకపోవడానికి కారణం?
జ - మనకు వాక్ స్వాతంత్రం ఉన్నది. ఆ స్వాతంత్రాన్ని ఉపయోగించుకోవటానికి భయడేవాళ్ళను చూస్తె నాకు అసహ్యం.చెప్పదలుచుకున్నది, పేరు చెప్పుకుని చెప్పాలి. పేరులేకుండా చెప్పేవాళ్ళు, తాము చెప్పే విషయం మీద నమ్మకం లేనివాళ్ళని నా భావన. తాము చెప్పే విషయం మీద నమ్మకం ఉన్నప్పుడు పేరు వ్రాసుకోవటానికి భయం దేనికి!? అవాకులూ చెవాకులూ వ్రాసి పారిపోవటానికి అజ్ఞాత పేరు బాగా ఉపయోగపడుతున్నది. అందుకనే నా బ్లాగులో అజ్ఞాతలకు చోటులేదు.

ప్ర - తెలుగు బ్లాగు అగ్రిగేటర్లలో రావలసిన మార్పులు ఏమిటి?
జ - నిజమైన బ్లాగులు తక్కువయ్యిపోయి కమర్షియల్ బ్లాగులుఎక్కువయ్యిపొయ్యాయి. ప్రతి చెత్తనూ చేర్చకుండా ఉండటమే రావలిసిన పెద్ద మార్పు.

ప్ర - బ్లాగు ప్రపంచంలో ఎదురైన ఆటంకాలు? ఇబ్బంది అనిపించిన సందర్భాలు?
జ - పెద్దగా ఏమీ లేవు.

ప్ర - సోషల్ మీడియాలో బ్లాగులు ,ఫేస్ బుక్ వంటి వాటిలో భావప్రసారానికి ఏ వేదిక బాగుంటుంది?
జ - నా దృష్టిలో బ్లాగుల్లోనే భావ ప్రసారానికి ఎక్కువ అవకాశం. ఫేస్ బుక్ లో మన స్నేహితులతో మాత్రామే మనం మన ఆలోచనలను పంచుకోగలం, బ్లాగుల్లో ఎవరైనా చూడగలరు. ఎక్కువ మందికి మనం వ్రాసే విషయాలు చేరతాయి.

ప్ర - సోషల్ మీడియా లేదా బ్లాగు ప్రపంచం లో ఆకతాయి కామెంట్లు చేసేవారిని అరికట్టడానికి ఏమి చేయాలి?
జ - 'మోడరేషన్' పెట్టి నిర్దాక్షణ్యంగా తొలగించటమే. పరిధి దాటితే 'సైబర్ యాక్టు' ప్రయోగించాలి.

ప్ర - తెలుగు బ్లాగుల అభివృద్ధికి మీరిచ్చే సూచనలు?
జ - ఆగ్రిగేటర్లు, ప్రతి చెత్తనూ కలిపెయ్యటం వల్ల, బ్లాగులాగా కనపడుతూ, తీరా అక్కడకు వెడితే వ్యాపార వెబ్సైటుకు లింకు ఉంటుంది. అలాంటి వ్యాపార వెబ్ సైట్లను అగ్రిగేటర్లనుంచి వేరు చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. తప్పదు అనుకుంటే  వ్యాపార వెబ్సైట్లకు దారితీసే బ్లాగులను వేరుపరిచి ప్రత్యేక విభాగం ఏర్పరిస్తే బాగుంటుంది. అలాగే కొందరు బ్లాగులు పెట్టుకుని కొన్ని కొన్ని రాజకీయ పార్టీలకు ప్రచారం చేస్తూ, విద్వేషాన్ని వెళ్ళగక్కుతూ ఉంటారు. అటువంటి బ్లాగులవల్ల అనవసరమైన కోపతాపాలు, పనికి రాని చర్చలు అనేకం జరుగుతూ ఉంటాయి. అలాంటి బ్లాగులవల్ల ఎంతవరకూ ఉపయోగం అని ఆలోచించాలి. అలాంటి బ్లాగులను గురించి కూడా ఏమి చెయ్యాలి? అన్న విషయం చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలి.

ప్ర - బ్లాగుల వల్ల ఉపయోగాలేమని మీరు అనుకుంటున్నారు?
జ - సరదాగా చదువుకోవటానికి బాగుంటాయి. పోను పోను కొంతకాలానికి ఇక వార పత్రికలూ అంటూ ఉండక పోవచ్చు. ఎవరికి ఆసక్తి ఉన్న విషయాలు వ్రాస్తూ ఉండటం వల్ల, బ్లాగుల ఆగ్రిగేటర్లు చూస్తె చాలు ఇరవై వార పత్రికలను చదివినంత అనుభూతి కలుగుతున్నది.

ప్ర - నేటి యువతకు మీరిచ్చే సలహాలు ఏమిటి?
జ - చేసే పనిలో సిన్సియారిటీ ఉండాలి, ఎదో జీతం తీసుకుంటున్నాం కాబట్టి ఇంత చేస్తే చాలు అనుకోవటం తప్పు. ఉద్యోగాల కోసం, ప్రమోషన్లకోసం చదవద్దు, ప్రమోషన్ల కోసం పనిచెయ్యద్దు. చేసే పని ఏదైనా సరే, శ్రద్ధగా మనసు పెట్టి పని చెయ్యాలి. ఫలితాలు వాటంతట అవ్వే వస్తాయి. గుర్తింపు కోసం విపరీతాలు చెయ్యవద్దు. కష్టపడి పనిచేస్తుంటే గుర్తింపు తనంతట తానె వస్తుంది.

ప్ర - ఇతరులను నొప్పించకుండా మాట్లాడాలంటే ఏమి చేయాలి?
జ -కష్టమైన పని. అన్నిసార్లూ కుదిరేది కాదు. ఎప్పటికప్పుడు ఎవరన్నా నొచ్చుకుంటారేమో అనుకుంటూ పంచదార పూత పూస్తూ మాట్లాడటం అలవాటు ఐతే, ఇచ్చకాల మనుష్యులు తయారవ్వుతారు. మొదట్లో నొచ్చుకున్నా మనం అనే మాటల్లో వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని మనం ఖరాఖండిగా చెప్పగలిగితే,  అర్ధం చేసుకోగలిగిన వాళ్ళు చేసుకుంటారు. చేసుకోనివాళ్ళు మనకు అక్కర్లేదు.

ప్ర - మీ అభిమాన నాయకుడు?
జ - ఎవరూ లేరు.

ప్ర - మీకు నచ్చిన సినిమా  ?
జ - 12 Angry Men, కన్యాశుల్కం, అష్టా చెమ్మా, Patton, Lawrence of Arabia, A Bridge too Far

ప్ర - మీ అభిమాన నటీ నటులు ఎవరు?
జ - మనకు హీరోలుగా చెలామణి అయిన వారికి పెద్దగా నటన రాదు. వాళ్లకు ప్రేక్షకులను ఆకర్షించటం మాత్రమే వచ్చు. అది నటన కాదు. నాకు బాగా నచ్చిన నటీ నటులు అందరూ కూడా హీరో హీరోయిన్లు వేసిన వాళ్ళు కాదు. సి ఎస్ ఆర్, ఎస్ వి రంగారావు, గుమ్మడి వెంకటేశ్వర రావు, గోవిందరాజుల సుబ్బారావు, అల్లు రామలింగయ్య, సూర్యకాంతం, ఛాయాదేవి, హేమలత, కన్నాంబ.


ప్ర - తెలుగు భాషపై మీకు ప్రత్యేక ప్రేమ ఏర్పడడానికి కారణం?
జ - తెలుగు నా మాతృభాష కాబట్టి.

ప్ర - తెలుగు భాష అభివృద్ధికి మీవంతుగా ఏమి చేస్తున్నారు?
జ - వీలైన చోటల్లా తెలుగును తెలుగులో వ్రాస్తాను. సాధ్యమైనంత వరకూ ఆంగ్ల పదాలు వాడకుండా తెలుగులో వ్రాయటానికి ప్రయత్నిస్తున్నాను. అలా అని, ప్రతి ఆంగ్ల పదాన్ని వేర్రేక్కినట్టు అనువాద పదాలు తయారు చెయ్యటానికి నేను వ్యతిరేకం. కొత్త పదాలు జనబాహుళ్యం నుండి రావాలే కాని, పండితులు అనుకునేవారి డ్రాయింగు రూములనుండి కాదు అని ధృఢమైన అభిప్రాయం. తెలుగు భాషాభివృధ్ధి కోసం పాటుపడాలి అనుకునేవారు ముందుగా తెలుగును తెలుగు లిపిలో వ్రాయటం మొదలు పెట్టాలి. తెలుగును తెలుగు లిపిలో కాకుండా ఆంగ్ల లిపిలో వ్రాయటం చాలా ఘోరమైన విషయం. తెలుగును ఆంగ్ల లిపిలో వ్రాసేవాళ్ళంటే నాకు అసహ్యం. తెలుగులో వ్రాయటం నాకు రాదండీ అని సిగ్గులేకుండా చెప్పుకునే వాళ్ళను చూస్తె కోపం. కొత్త సెల్ ఫోను వచ్చింది అరగంటలో అందులో ఉన్న అన్నివిషయాలు నేర్చేసుకుంటాము (ఇంగ్లీషు రాకపోయినా సరే), టాటా స్కై వాడిచ్చిన తింగరి రిమోట్ ఐదు నిమిషాల్లో ఉపయోగించటం తెలుసుకుంటాము, కొత్తగా వచ్చిన కారుని ఎలా డ్రైవ్ చెయ్యాలో  ఎవరూ నేర్పకుండానే నేర్చుకుంటాము , ఎటిఎం లో డబ్బులు తియ్యటం, ఆన్ లైన్లో టిక్కెట్లు తీసుకోవటం అన్నీ వస్తాయి. తెలుగులో వ్రాయటం మటుకు రాదు. తెలుగును తెలుగు లిపిలో  వ్రాయటం రాకపోవటం ఒక మానసిక రోగం అని నా ఉద్దేశ్యం.

ప్ర - ప్రస్తుత రాజకీయాలపై మీ అభిప్రాయం?
జ - ఒకప్పుడు 'యధా రాజా తధా ప్రజ'గా ఉన్నది. ఇప్పుడు అది తిరగబడి, 'యధా ప్రజా, తధా రాజా' గా మారిపోయింది. మనం మారకుండా మన్ని పరిపాలించేవాళ్ళు మారాలి అనుకోవటం ఆత్మవంచన. ఐదేళ్లకు ఒక్కసారి కాసేపు లైన్లో నంచుని (అందుకు శలవు ఇచ్చినా సరే) తమకు నచ్చిన వ్యక్తికిఓటు వెయ్యని వాళ్ళు రాజకీయాల గురించి మాట్లాడటానికి అనర్హులు. రాజకీయ నాయకులను తిట్టే ముందు మన్ని మనం చూసుకోవాలి. మనంచేసే ప్రతి పనిని క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. సమాజం అనేది, ఎక్కడినుంచో రాలేదు, మనందరం కలిస్తేనే సమాజం. మనకు సవ్యమైన నాయకులు రావాలంటే, మన అందరం సవ్యంగా ఉండాలి. సవ్యంగా లేని వారిని ప్రశ్నించే మానసిక స్థైర్యం అలవర్చుకోవాలి. అలా అలవార్చుకోలేని నాడు మనకు సమాజంలో ఉన్న అల్లరి మనుష్యులే (Lumpen elements) నాయకులు అవుతారు 

ప్ర - మీ అభిమాన రచయిత ?
జ - తెలుగులో శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, శ్రీ కొడవటిగంటి కుటుంబరావు, శ్రీ చలం, శ్రీ మధురాంతకం రాజారాంశ్రీభమిడిపాటి కామేశ్వర రావు, శ్రీముళ్ళపూడి వెంకటరమణ. ఆంగ్లంలో నీవిల్ షూట్ (Nevile Shute),  మార్క్ ట్వైన్ (Mark Twain), మనోహర్ మల్గోంకర్ (ManoharMalgonkar), రస్కిన్ బాండ్ (Ruskin Bond), ఆర్ కే నారాయణ్ (R.K. Narayan)

ప్ర - మీకు నచ్చే రచనలు?
జ - కుటుంబ కథలు ఎక్కువగా నచ్చుతాయి. మానవ ప్రవర్తనను విశ్లేషిస్తూ వ్రాసిన కథలు, నవలలు ఎక్కువగా ఇష్టపడతాను. ఒక ఇజాన్ని పట్టుకుని ప్రజలను రెచ్చగొట్టటానికి సాహిత్యాన్ని వాడుకోవటం నేను గర్హిస్తాను, అటువంటి రచనలు చదవటం ఇష్టం లేదు.

ప్ర - 'సాహిత్యం' అనే పదానికి నిర్వచనం చెప్పగలరా?
జ - జీవన విధానాన్ని, మానవ ప్రవృత్తిని, రకరకాల మనస్తత్వాలను, ఆ మనస్తత్వాల పరిణామాన్ని పరిశీలించి వ్రాయగల వ్రాతలే 'సాహిత్యం' అనిపించుకుంటాయి. మనకేదో అనిపించింది ఆ అనిపించినది చెప్పటానికి రెండు మూడు పాత్రలు సృష్టించి మన ఆవేశాన్ని జనం మీదకు వదలటం 'సాహిత్య ప్రక్రియ' కాదు అని నా అభిప్రాయం.

ప్ర - 'సాహిత్యం' తో మీ అనుబంధం ఎలా ఆరంభమయింది?
జ - చాలా చిన్నతనంలో మా తాతయ్య చెప్పే కథలు, సంఘటనలు, ఇలా వేరే మనకు తెలియని విషయాలు తెలుసుకోవటంలో ఆనందం అనుభవంలోకి వచ్చింది. నేను నాలగవ తరగతి వరకూ ట్యూషన్ మాష్టారి ద్వారా పెద్దగా స్కూలుకు వెళ్ళకుండానే చదువుకున్నాను. ఇందుమూలంగా నాకు చేతిలో ఎక్కువ టైము ఉండేది. పాఠ్య పుస్తకాలు కథల్లా  చదువుకునే అవకాశం దొరికింది. ఐదో తరగతికి వచ్చేప్పటికి మా తండ్రి గారు చందమామ పరిచయం చేశారు, ఆంధ్ర సచిత్ర వార పత్రికలో కార్టూన్లు చూడటం మొదలుపెట్టి, ఆరో తరగతికి వచ్చేప్పటికి ధారావాహికలు చదవటం నేర్చుకున్నాను.అలా మొదలయ్యిన సాహిత్య అధ్యయనం మెల్లిగా పెద్ద రచయితల పుస్తకాలు చదవటం, లైబ్రరీకి వెళ్లి రకరకాల పుస్తకాలు చదవటం మొదలయ్యింది. తొమ్మిదో తరగతిలో మాకు ఇంగ్లీషులో ఒక నాన్-డీటెయిల్ ఉండేది. చిల్డ్రన్ ఆఫ్ న్యూ ఫారెస్ట్. ఆ పుస్తకం చదవటం మొదలు పెట్టి ఆంగ్ల పుస్తకాలు అర్ధం కావటం మొదలు పెట్టేప్పటికి ఆ ఆనందంలో ఇంగ్లీషు  పేపరు చదవటం, ఇది చూసి మా నాన్న నాకు కోలిన్స్ పాకెట్ డిక్షనరీ ఇవ్వటం, నేను ఒక చిన్న నోట్ బుక్ పెట్టుకుని తెలియని పదాల అర్ధాలు వ్రాసుకుంటూ, ఆంగ్ల భాష మీద మక్కువ పెంచుకుని ఆంగ్ల సాహిత్యంలో చదవటం సాగించాను. సాహిత్యం మీద మక్కువ ఒక్కరోజులో వచ్చినది కాదు. పుస్తకాలు చదువుతూ నా అభిరుచి నాకు నేనే కనుగొంటూ పెరగటం వల్ల వచ్చినది ఈ సాహిత్య అనుబంధం.

ప్ర - 'సాహిత్యం' ద్వారా మనిషి ప్రవర్తనలో వచ్చే మార్పు ఏమిటి?
జ - సాహిత్యం ద్వారా మనిషికి తప్పకుండా జరిగే మేలు భాష తెలియటం. తరువాత ప్రపంచాన్ని వేరొకరి కళ్ళల్లోంచి చూడటం. ప్రపంచాన్ని పరిశీలించే అలవాటు సాహిత్యం వల్ల తప్పకుండా ఏర్పడుతుంది . సాహిత్యం ద్వారా మనిషి ప్రవర్తనలో మార్పు వస్తుందా? లేదా? మానవ ప్రవృత్తి సాహిత్యంలో ప్రతిబింబింస్తుందా? అంటే రెండోదే ఎక్కువ. సాహిత్యం మనిషి ప్రవర్తనలో పెద్ద మార్పు వెంటనే రాకపోవచ్చు. మంచి పుస్తకాలు చదవటం కొనసాగించటం వల్ల మనిషిలో మార్పు రావటం జరుగుతుంది. ఇక్కడ కూడా చదివే వారి దృక్పథం మీద ఆధార పడి ఉంటుంది. ఏదో కాలేక్షేపానికి, వేరే పనేమీ లేక చదివితే పెద్దగా ఒంటపట్టక పోవచ్చు

ప్ర - 'సాహిత్యం" లో  పద్యం, కథ , నవల ....ఇలా వీటిలో, ఏ ప్రక్రియ మీకు ఎక్కువ ఇష్టం?
జ - నాకు పద్య తెలుగు రాదని చెప్పుకోవటానికి సిగ్గు పడుతున్నాను. నేర్చుకోవాలి. కాబట్టి పద్యం అర్ధం కాదు. ఆ కారణాన, కథ ఆపైన  నవల ఈ రెండు సాహిత్య ప్రక్రియలు ఇష్టం. రెండిట్లో కథ అంటే ఎక్కువ మక్కువ. నా ఉద్దేశ్యంలో కథ వ్రాయటం,  నవల వ్రాయటం కంటే కష్టం. రెండు మూడు పేజీల్లో పాఠకుడిని పట్టుకుని చదివించి, తాను ఏమిచెప్పదల్చుకున్నాడో, రచయిత చెప్పగలగాలి. నవలల్లో ఒక ప్రపంచాన్ని సృష్టించుకుని, అనేక పాత్రలద్వారా కథ నడుపచ్చు. వ్రాయటం బాగా వచ్చిన వారు నవలలు కూడా కథలంత ఆసక్తికరంగా వ్రాయటం మనం చూస్తూ  ఉన్నాము. ఇలా అని నవలల మీద చిన్న చూపులేదు. కొడవటిగంటి వంటివారు అదుతమైన నవలలు, కథలు రెండూ వ్రాసి పేరు తెచ్చుకున్నారు. ప్రసిద్ధ అమెరికన్ కథా/నవలా రచయిత మార్క్ ట్వైన్, ప్రసంగించటం గురించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. ఆయన అంటారు,”మీరు నన్ను రెండు నిమిషాలు మాట్లాడటానికి పిలిస్తే నాకు తయారు కావటానికి మూడు నాలుగు రోజుల సమయం ఇవ్వాలి. సరే మూడు గంటలు మాట్లాడాలంటారా. పదండి బయలుదేరుదాం!” ఆయన చెప్పదల్చుకున్నది చక్కగా చెప్పారు.

ప్ర - 'సాహిత్యం' సమాజం పై ఏమి ప్రభావం చూపుతుంది?
జ - జానపద సాహిత్యం, పరంపరాగతంగా వచ్చే పాటలు వంటివి ఎక్కువగా సమాజం మీద ప్రభావం చూపాయి. ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అనే విషయాలు చక్కటి పాటల ద్వారా, పురాణ గాధల ద్వారా సమాజం  మీద చాలా ప్రభావం చూపింది. ఈరోజున, ఏ మతం తీసుకున్నా కూడా, ఆయా మతాలలో కొన్ని గ్రంధాలు ఉంటాయి. మతం ఏదైనా కానివ్వండి,ఆయా మతాలలో ఉన్న రకరకాల సాహిత్య ప్రక్రియల వల్లే  ఆయా మతాల ప్రభావం సమాజం మీద పడింది.  పురాణాలు,ఇతిహాసాలు,దేవుడి కథలు, సూక్తులు, గ్రంధాలు అన్నీ కూడా సమాజం మీద తీవ్రమైన ప్రభావం చూపినాయి. ఈ ప్రభావం నుండి ప్రపంచంలో ఏ సమాజమూ కూడా తప్పించు కోలేక పోయింది.భారత దేశంలో చూస్తె మన సంగీతం అంతా కూడా పురాణాల మీదే ఆధారపడి ఉన్నది, కీర్తనలు కానివ్వండి, కృతులు కానివ్వండి, పాటలు కానివ్వండి తరతరాలుగా మతం చుట్టూనే ఎక్కువగా తిరగటం చూస్తాము. అన్నమాచార్య వంటివారు సమాజానికి కావాలిసిన అనేక విషయాలు తమ రచనల ద్వారా తెలియచేశారు. ఇలా మతాల వల్ల ఏ సమాజం మీద ఎటువంటి ప్రభావం చూపినది అని చూస్తె, ఒక్కొక్క మతం ఒక్కొక్క విధమైన ప్రభావాన్ని చూపింది. కొన్ని మతాలూ సుఖంగా బతుకుతూ ఇతరులకు కష్టం కలగకుండా బతకటం నేర్పితే, మరికొన్ని మతాలు యుద్ధాలు చేసి, తోటి మానవులను చంపి భయపెట్టి అయినా సరే తమ మతం లోకి అందరినీ చేర్చేయ్యాలన్న దుగ్ధను ప్రేరేరించినాయి. క్రిస్టియన్, ముస్లిం మతాల వారు  ప్రపంచ వ్యాప్తంగా  దురాక్రమణలు చేసి తమ మతాలను ఇతరుల మీద బలవంతంగా రుద్దకుండా ఉండి ఉంటే ప్రపంచం ఈనాడు ఎంత అద్బుతంగా ఉండేది అనిపిస్తుంది.ఇదంతా పూర్వం. ప్రస్తుతానికి వస్తే, సాహిత్యం సమాజం మీద ఎంత, ఎలాంటి ప్రభావం చూపిస్తున్నది అంటే, ఎక్కువ ప్రభావం చూపిస్తున్నది సినిమాలు, చౌకబారు సాహిత్యం. ఈ పని చేయ్యచ్చు ఈ పని చెయ్యకూడదు అనే విచక్షణను చెప్పలేని సాహిత్యం కూడా ఈరోజున వచ్చి సమాజ మీద దారుణమైన ప్రభావం చూపిస్తున్నది.

ప్ర - చందమామ లాంటి పిల్లల పత్రికల అవసరం నేటి సమాజానికి అవసరం లేదంటారా?
జ -తప్పకుండా ఉన్నది. కాని దురదృష్ట వశాత్తూ అలాంటి అద్భుతమైన పత్రికలూ నడపగలిగే సంస్థలు కరువయ్యాయి.
నేను చదివిన జూన్ నెల 1966 చందమామ ముఖ చిత్రం
ప్ర - ఆధ్యాత్మికతకు మీరిచ్చే నిర్వచనం?
జ - 'అహం బ్రహ్మాస్మి' అనుకున్నప్పుడు ఎక్కడెక్కడో ఎందుకు వెతకాలి! మనలోనే ఉన్నాడు దేవుడు. దేవుడు లేకపోతే మనం లేము, లోకం లేదు. దేవుణ్ణి సంతృప్తి పరచటానికి ఏవేవో చెయ్యాలి, తంతులు అవ్వి చెయ్యాలి అనుకోవటం నాకు నచ్చని విషయం. ఫలానా ఫలానా చెయ్యాలి లేకపోతె దేవుడుకి కోపం వస్తుంది వంటి అభిప్రాయాలకు దూరంగా ఉంటాను. మరొకళ్ళకు అడ్డంరాకుండా,  మన బతుకు మనం బతుకుతూ, మన కుటుంబాన్ని పైకి తీసుకు రాగాలగటం కంటే మించిన ఆధ్యాత్మికత ఉండదని నా అభిప్రాయం.

ప్ర - మతం పై మీ అభిప్రాయం?
జ - మతం అంటే ఒక జీవన విధానం. సంఘ జీవనం మొదలుపెట్టినాక ఒక్కొక్క ప్రదేశంలో ఉండే వారు ఒక్కొక్క జీవన విధానాన్ని అక్కడ ఉన్న వాతావరణ, భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఒక్కొక్క రకపు జీవన విధానాన్ని ఏర్పరుచుకున్నారు. ఆ జీవన విధానం కూడా ఎదో ఒక్కరోజున వచ్చినది కాదు. పరిణామ క్రమంలో జీవన విధానాలు ఏర్పడ్డాయి. హిందూ మతం అనండి, సనాతన ధర్మం అనండి ఏదైనా కూడా ఒక సంఘంగా ఎలా ఉండాలో చెప్పినవే తప్ప మరొకటి కావు. ఈ జీవన విధానాల్లో రాను రాను కొన్ని దురాచారాలు ప్రవేశించినాయి. . వాటిని రూపుమాపే "బాధ్యత" సమాజంలో సవ్యంగా ఆలోచించగలిగిన వాళ్ళదే. దీనికోసం  మన సంఘాన్ని పూర్తిగా నాశనం చేసేసుకుని విదేశీ జీవన విధానాలను “కాపీ” కొట్టాల్సిన పనిలేదు అని నా అభిప్రాయం.

ప్ర - సనాతన ధర్మం పై మీ అభిప్రాయం?
జ - పైన మతం గురించి చెప్పినప్పుడే ఈ విషయం గురించి చెప్పాను.

ప్ర - మీరు ఆస్థికులా?నాస్తికులా? దేవుడు లేదా దైవత్వం అనే అంశానికి మీరిచ్చే నిర్వచనం?
జ - నేను విపరీత భక్తుణ్ణి కాదు. దేవుడు అని పిలవండి, ఆ దేవుడికి మీ ఇష్టమైన పేరు  పెట్టండి. ప్రపంచానికి మూలం అంటూ ఉండాలికదా. ఈ శక్తి అంతా కలిపే దేవుడు. మన అందరిలో ఉన్న ఎనర్జీ అంతా కూడా దేవుడే! కాని విపరీత భక్తికి చాదస్తపు భక్తికి నేను దూరం. ఎప్పుడైనా వెడితే గుడి కి వెడతాను కాని దేవుడికి లంచాలు పెట్టి ఫలానా, ఫలానా పని కావాలి అని అడగలేను. అందరూ బాగుండాలి అని మాత్రమె నా ప్రార్ధన. 

ప్ర - మీ బ్లాగులో ప్రతి వినాయక చవితికి ప్రజలలో ఎవేర్నెస్ తీసుకురావడానికి మంచిప్రయత్నం చేస్తున్నారు. ఏమేరకు ఫలితం సాధించాననుకుంటున్నారు?
జ - ప్రభావం కనిపిస్తుంది, కనపడదు అనే విషయం పట్టించుకోకుండా వ్రాస్తూ పోవాలి. ఏదో, రోజుకి ఒక వందమంది చూసే భ్లాగులో మనకు తోచిన నాలుగు మాటలు వ్రాసినంత మాత్రాన సమాజం మారిపోతుంది అనుకోవటం భ్రమ. మన ప్రయత్నం మన చేస్తూ ఉంటాము, విన్న వాళ్ళు వింటారు, విన్నవాళ్ళల్లో మారిన వాళ్ళు మారతారు.

ప్ర - స్వామి మాల ధరించేవారిపైనా మీరు ఆర్టికల్స్ వ్రాసినట్లున్నారు. మాలధారణ ద్వారా అలవాట్లు మార్చుకునేవారుండరంటారా
జ - ఆ వ్యాసం వ్రాసినది మా తమ్ముడు కప్పగంతు రాధాకృష్ణ. అప్పటికి అతనికి ప్రత్యెక బ్లాగు లేని కారణాన నా బ్లాగులోనే ప్రచురించాను. మాల ధారణ వల్ల అలవాట్లు మారతాయా అంటే, కమ్యూనిస్టు పార్టీలో చేరిన వాళ్ళందరూ సమ సమాజం కోసం పాటుపడుతున్నారా, లేక ఇదొక వృత్తా అన్నట్టుగా ఉన్నది. ఈ మాల ధారణ అనే ప్రక్రియ దాదాపుగా 1970 లలో ఎక్కువగా ఊపు అందుకున్నది. మా చిన్నతనంలో సాయిబాబా, మెహర్ బాబా భజనలు ఉండేవి కాని,మాల ధారణలు, మైకుపెట్టి మరీ దుమ్ము దులిపే భజనలు అప్పట్లో మేము ఎరగం.

ప్ర - అలవాట్లు మార్చుకోవడానికి మంచి అవకాశాలు ఏమిటంటే, మీరేమైనా సూచనలు చేయగలరా?
జ - ఒక మనిషికి తన అలవాటు తప్పని,ఆ అలవాటు మార్చుకోవాలని తెలియాలిగా. అలా తెలియచెప్పే వారే ఈ రోజున కరువై పొయ్యారు. సిగిరెట్టు తాగుతూ కనపడే ఉపాధ్యాయుడు తన విద్యార్ధులకు పొగ తాగొద్దని చెప్పగలడా! రోజూ రాత్రికి ఇంటికి తాగి వచ్చే తండ్రి, తన పిల్లలకు ఏమి చెప్పకుండా చెబుతున్నాడు? చెబితే వినగలిగే వాళ్ళు, చెడు అలవాట్లకు బానిసలు కాకుండా బాగుపడతారు ఎవడో చెబితే మనం ఎందుకు వినాలి? అనుకునే వాళ్ళు పైకి రాలేరు.  అలవాట్లల్లో చెడ్డవీ,మంచివీ ఉంటాయి. ఏవి చెడ్డ అలవాట్లు అని అనుకుంటున్నామో వాటి బారిన పడకుండా, మంచి చెడు అనే విచక్షణ చేసి చెప్పగలిగిన వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే అలవాట్లు మార్చుకోవటానికి అవకాశం. మరొకటి, పరిశీలన. కొన్ని కొన్ని అలవాట్లు లేని వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎంత హాయిగా ఉంటున్నారో చూసి నేర్చుకోగలిగితే, చెడు అలవాట్ల నుంచి బయటపడే అవకాశం ఉన్నది.

ప్ర - నేటి యువత అనేక పెడధోరణులతోనూ, మన సంస్కృతీ సాంప్రదాయాలకు దూరంగా జరుగుతుండడం పట్ల మీ అభిప్రాయం?
జ - మొత్తం మొత్తం యువతను ఒకటే గాటను కట్టి పెడ ధోరణులను పట్టేశారు అని అనటం సరికాదు. నేటి యువతలో ఎక్కువ శాతం విద్యను  అభ్యసించటం మీద ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు, ఆ విద్య కూడా గుమాస్తా చదువులు కాకుండా వృత్తి విద్యలకు ఎక్కువ ప్రాధ్యానం ఇస్తున్నారు. ఈరోజున ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే వాళ్ళు లేనే లేరు. ఎంప్లాయ్మేంటు ఎక్చేంజీల చుట్టూ తిరిగే యువత ఈనాడు కానరాదు. స్వంతంగా వ్యాపారాలు, వృత్తులు చేబట్టేవారు పెరుగుతున్నారు,. ఎప్పుడు చూసినా వాడెవడో మన్ని పైకి రానివ్వడు, ఎవడో మన్ని దోచుకోవటానికి ఉన్నాడు అందుకనే మనం పైకి రాలేక పోతున్నాము అనుకునే ఏడుపుగొట్టు యువత ఈరోజున మనకు చాలా తక్కువ కనపడుతున్నది. ఉత్సాహమే ఊపిరిగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలని ఎక్కువమంది యువతీ యువకులు ఈరోజున ఆలోచిస్తున్నారు. 

ఈనాటి యువత మన  సంస్కృతీ సాంప్రదాయాలకు దూరంగా జరిగిపోతున్నారు అని నేను అనుకోవటం లేదు.1970 లు 1980 లలో యువతరం మీద ఉన్న వామపక్ష భావజాలం, వామపక్ష ఆలోచనా ధోరణులు ఈనాటి యువత మీద లేవు. "సమర్ధుడికి ఎదురు లేదు, అసమర్దుడుకి ఎదుగు లేదు" అని ఈ నాటి యువత నమ్ముతున్నది అని నా అభిప్రాయం.

ప్ర - భారతీయ జీవన విధానంలో కొన్ని పెడధోరణుల లేదా మూఢత్వాల ప్రవేశంకు కారణం ఏమిటి?వాటిని నిరోధించే మార్గం ఏమిటి?
జ - ఒక్క భారతీయ సమాజాన్నే ఎందుకు మీరు విమర్శిస్తున్నారు. మూఢత్వాల ప్రవేశం ఒక్క మనం సమాజంలోనే ఉన్నదా!? దాదాపు అన్ని సమాజాల్లోనూ మూఢత్వాలు ఉన్నాయి. ఎంతగానో అన్ని రంగాల్లోనూ అభివృధ్ధి చెందాయనుకున్న దేశాల్లో అనేక అవక తవకలు జరుగుతున్నాయి. తూర్పు జెర్మనీ వారు పశ్చిమ జర్మనీతొ ఉన్న తమ సరిహద్దుగా గోడ కట్టుకొవటం దేనికి? తమ ప్రజలు  పశ్చిమానికి పారిపోకూడదనే కదా. తమ నెత్తికి బలవంతాన రుద్దబడిని జీవన విధానంలో బతకలేని ప్రజలను  పశ్చిమ జెర్మనీకి వెళ్ళనివ్వకుండా గోడ కట్టేసి నిలవరించటం ఎటువంటి చర్య?ఆ దుశ్చర్య  దాదాపుగా ఐదు దశాబ్దాలు నిలిచి ఉన్నది.  అలా నిలిచి ఉండటానికి కారణం ఆ దేశంలో ఉన్న మూఢత్వమే కారణం అని నెను అనుకుంటున్నాను. నిన్నగాక మొన్న ఐర్లాండులో ఏమి జరిగింది. బిడ్డ ప్రసవం జరిగితే పెద్ద ప్రాణానికే ముప్పు అని తెలిసినా, ఆ తల్లి పాపం తనకు గర్భ స్రావం చెయ్యమని ప్రాధేయపడినా కూడా వినకుండా తమ మత సూత్రాలు వల్లెవేసి, ఆ తల్లి మరణానికి కారణం ఏమంటారు, మౌఢ్యమా? తెలివితేటలా?.  రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ అనేక వేలమంది మరణానికి కారణం అని చరిత్ర. అమెరికాను కనిపెట్టినాక అక్కడకు వెళ్ళిన యూరోపియన్లు చేసినది ఏమిటి? అమెరికాలో సుఖంగా తమ బతుకు బతుకుతున్న వాళ్లకు “రెడ్ ఇండియన్లు” అని పేరు పెట్టి, జంతువులను వేటాడినట్టు వేటాడి, ఆ జాతిని దాదాపుగా సమూలంగా తుడిచి పెట్టేశారు. ఎటువంటి మూఢత్వం లేకపోతె ఇటువంటి పన్లు చెయ్యగలరు! అదే అమెరికాలో తమ పనులు చేయించుకోవటానికి, నల్ల జాతివారిని బలవంతాన బానిసలుగా తీసుకువెళ్ళి వాళ్ళను జంతువులను అమ్ముకున్నట్టు ఒకరికొకరు అమ్ముకుంటూ, నల్ల జాతివారిని దారుణంగా హింసించి వాళ్ళను మనుష్యులకంటే హీనంగా చూసినది ఎవరు, అలా చూడటానికి కారణం వాళ్ళల్లో ఉన్న మౌఢ్యమే కారణం. గట్టిగా వందా నూటేభై ఏళ్ల క్రితం వరకూ ఇలాంటి ఘోరం ఆ దేశంలో జరుగుతూనే ఉన్నది.

ఇలాంటి ఘోరాలు మన దేశంలో ఎప్పుడన్నా జరిగాయా? లేదు. కాని మనదేశంలో జరిగేవి, ఇక్కడా జరిగాయి. సతీ సహగమనం, అస్పృశ్యత, కన్యాశుల్కం, వరకట్నం వంటివి మన సమాజాన్ని పట్టి పీడించినాయి. కాని కాల క్రమేణా అటువంటి దురాచారాలు  కనుమరుగు అవుతున్నాయి. కొన్ని పూర్తిగా మాయం అయిపోయినాయి కూడా.   మన సమాజం తనను తాను నియంత్రించుకున్నంత తొందరగా, సమర్ధవంతంగా మరే సమాజమూ విప్లవాలూ, యుధ్ధాలు లేకుండా చేసుకోలెకపోయినది. మన భారత దేశ సమాజపు పరిణితి వల్ల మాత్రమే ఇది సాధ్యం అయిందని నేను నమ్ముతున్నాను.

ప్రపంచ మొత్తం సమాజ పరిణామ క్రమంలో అనేక మార్పులు వస్తూ ఉంటాయి, వాటిల్లొ కొన్ని మంచి, కొన్ని చెడు ఎప్పుడూ ఉంటాయి. అది చెడు అని తెలిసి ఆ చెడును తొలగించాటానికి సమయం పడుతుంది. ఆ సమయంలో కొన్ని తరాలు వెళ్ళిపోవచ్చు. సమాజాల్లో కాలక్రమాన వచ్చే 'చెడు' ను  నిరోధించటానికి మార్గాలు లేవు అనుకునే వీలు లేదు. ఒక వంద ఏళ్ళక్రితం భారత దేశానికి, ఈరోజున మనం చూస్తున్న భారత దేశానికి ఎంత తేడా ఉన్నది. వందేళ్ళ క్రితం ఉన్న చెడు ఈరోజున లేదు కదా!

ప్ర - దాదాపు రిటైర్మెంటుకు దగ్గరగా ఉన్నారు. ఇన్నేళ్ల వయసులోనూ చాలా సృజనాత్మకంగా ఆలోచించగలుగుతున్నారు. ఇతరులకు ప్రేరణ ఇవ్వగలుగుతున్నారు. ఎలా సాధ్యమవుతున్నది?
జ - వయస్సుకు సృజనాత్మతకు సంబంధం ఉంటుందని నేను అనుకోవటం లేదు. ప్రేరణ ఇవ్వటం అనేది మనం చెప్పే మాటలవల్ల కొంత ఉన్నా, వినేవాళ్ళ మీదే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఒకడు చెబితే వినేది ఏమిటి? అనుకునేవాళ్ళకు ప్రేరణ ఎక్కడనుంచి వస్తుంది. నా వరకూ, బ్లాగులో అప్పుడప్పుడూ వ్రాయటం, ఇతర బ్లాగుల్లో వ్యాఖ్యలు వ్రాయటం సృజనాత్మకత అని నేను అనుకోవటం లేదు.

ప్ర - మీ బ్లాగులో ఆడియో రికార్డింగులు, రేడియో ప్రసంగాలు వంటివి క్రియేటివ్ గా ఉన్న పోష్టులుంచుతుంటారు. ఇవి సృజనాత్మక ఆలోచన కాదంటారా?
జ - ఓకే! అదొక వెరైటీ ఆలోచన......నేనే మొదలు పెట్టానని అనుకోవటం లేదు. బ్లాగుల్లో వ్రాసినది ఆడియోలో ఉంచే ప్రయోగం మొదలు పెట్టాను. కాని పెద్దగా స్పందన లేక వదిలేసాను. విన్నవారు, మీ చదివే తీరు ఇలా ఉన్నది, ఇలా ఉంటే బాగుండేది, ఫలానా పదం అలా ఉచ్చరించారు , సరైన ఉచ్చారణ ఇది అని విశ్లేషించి అభిప్రాయాలు వ్రాసి ఉంటే ఆ ప్రయోగం కొనసాగించి ఉండేవాడినే!

మీరు ఇలా విషయాలు కదిలించేసరికి, నేను ఎప్పుడో 1989 లో రేడియో లో ఒక ఆంగ్ల ప్రసంగం చేసిన విషయం గుర్తుకు వచ్చింది. ఆకాశవాణి విజయవాడ కేద్రంలో సెప్టెంబరు 1989 లో On being Frank and Forthright అనే విషయం మీద ప్రసంగం ఇచ్చాను. నిన్న మొన్న వెతికితే అప్పటి టేపు దొరికింది. అది ఎంపి-3 చేసి నలుగురికి పంచుకుందామన్న ఆలోచనతో యు ట్యూబ్ లోకి జస్ట్ ఇప్పుడే  అప్లోడ్ చేసాను. నా రేడియో ప్రసంగం యు ట్యూబ్ లింకు క్రింద ఇస్తున్నాను.

వీడియో ఇక్కడే చూడాలనుకుంటే క్రింది వీడియో క్లిక్ చేయండి.

(వీడియో వస్తుంటే కనిపించే ఫోటో ఈ మధ్య తీసినదే. అప్పటి అంటే 1989 నాటి ఫోటో వెతికే సమయం లేక, అందుబాటులో ఉన్న ఫోటో అప్లోడ్ చేసాను)


ప్ర - మీడియాలో వ్యాపార ప్రకటనలను మీరు నిరసిస్తారు?మరి మీడియా వాటిమీదనే గదా ఆధారపడేది అంటే?
జ - దేనికైనా ఒక హద్దంటూ ఉండాలి కదా. మీడియా అంటే వ్యాపార ప్రకటనలే అన్నంతగా వ్యాపార ప్రకటనలు మీడియాను హైజాక్ చేసేసినాయి. హద్దూ పద్దూ లేని వ్యాపార ప్రకటనలను తప్పకుండా కట్టడి చెయ్యాలి.ఈ విషయం మీద నేను అనేక సార్లు నా బ్లాగులో వ్రాసాను. నా బ్లాగులో నేను వ్రాసిన కొన్ని సూచనలు ఇప్పుడు కొన్ని చానెళ్ళు పాటిస్తున్నాయి. వ్యాపార ప్రకటనా సంస్థలు అంటే వాటిద్వారా పెద్ద పెద్ద కార్పొరేట్లు మీడియాను నియంత్రిస్తూ యాడ్ మాఫియాగా మారిపోయి, వ్యాపార ప్రకటనా కాలుష్యాన్ని సమాజంలో కలుపుతున్నారు.

ప్ర - నేటి మీడియాలో రావలసిన మార్పులు ఏమిటి?
జ - రాజకీయ పార్టీలను రానివ్వటం చాలా దురదృష్టకరం. ఇదివరకు ఒక్కో పేపరు ఒక్కో పార్టీని నెత్తిన పెట్టుకు మోసేవి. ఇప్పుడు ఏకంగా పార్టీలే పత్రికలూ పెట్టుకు నడుపుతున్నాయి. మీడియాలో వ్యాపార పంధా అంటే వార్తలను అమ్ముకునే హీన స్థితి దిగాజారిపోయినాయి. ఇలాంటి హీన స్థితిలో ఉన్న మీడియాను ఎవరు బాగుచెయ్యగలరు అని నిస్పృహ కలుగుతూ ఉంటుంది. మీడియా తనంతట తాను మారగలిగే స్థాయి  మించిపోయిన అహంకారంతో ఉన్నది. పాఠకుల్లో చైతన్యం రావాలి, చెత్త వ్రాస్తున్నప్పుడు నిలదియ్యాలి, తప్పుడు వార్తలు వ్రాస్తుంటే అడ్డుకోవాలి. మీడియాను నియంత్రించాలేమో  అన్నంతగా వెర్రి తలలు వేస్తున్నది ఈనాటి మీడియా. ఇదొక సాకుగా తీసుకుని ప్రభుత్వం మీడియాను నియంత్రిస్తే ప్రజల్లో పెద్దగా స్పందన రాకపోవచ్చు. ఎందుకు అంటె, ఈ రోజున మీడియా తీరు అందరికీ విసుగు కలిగిస్తున్నది. ప్రభుత్వాలు, మీడియాను నియంత్రిచే అవకాశం ఇవ్వకుండా, మీడియా ముఖ్యంగా టి.వి చానెళ్ళు,  తమను తామె నియంత్రించుకునే ఒక ఆంబుడ్స్ మాన్ వ్యవస్థను ఏర్పరుచుకోవాలి. అంతకంతె మరొక మార్గం లేదు. 

ప్ర - కార్టూన్స్ ద్వారా సమాజానికి కలిగే మేలు ఏమిటి?
జ - హాస్యం, నవ్విస్తూనే చురకలు వెయ్యటం. ఆ చురకల వల్ల మారగలిగిన అదృష్టవంతులు ,మారతారు.
image courtecy http://babucartoon.blogspot.in/

ప్ర - కార్టున్స్ తో మీకున్న అనుబంధం ఏమిటి?
జ - చిన్నప్పటి నుంచీ కార్టూన్లు అంటే ఎంతో మక్కువ. ఊమెన్ గారి కార్టూన్లు, శంకర్స్ వీక్లీ లో కార్టూన్లు, బాబు, జయదేవ్ గారి కార్టూన్లు అంటే అభిమానం.


ప్ర - రేడియో ఒక జ్ఞాపకంగా మిగులుతుందారేడియో ద్వారా ఇంకా సమాజానికి ప్రయోజనం చేకూర్చవచ్చా?
జ - రేడియో టి వి పోటీ వల్ల మాత్రమె మరుగున పడింది. కాని టివి చూస్తూ మరొక పని చెయ్యలేం. కాని రెడియో వింటూ అనేకపనులు చేసుకోవచ్చు. రేడియో జ్ఞాపకంగా మిగులుతుందా అంటే చెప్పలేం కాని, పూర్వపు వైభవం మాత్రం రేడియోకు రాకపోవచ్చు. ఇప్పటికి కూడా టివి లో వచ్చే అన్నదాత వంటి అద్భుత కార్యక్రమాలకు మూలం రేడియోలో ఇప్పటికీ వస్తున్న పంటసీమలు వంటి కార్యక్రమాలే. వ్యవసాయదారులకు ఎంతో లబ్దికూర్చిన కార్యక్రమం పంటసీమలు,అలాగే వినోద విజ్ఞానాలను ఇచ్చే అనేక కార్యక్రమాలు ఇవ్వగలిగినది రేడియో.


ప్రసాద్ గారు చిన్నపుడు విన్న రేడియో

ప్ర - మీరు తీసిన ఫోటోలలో మీకు నచ్చిన ఫోటో ఏది?
జ - ఒక ఫోటోలో గాంధీ గారి బొమ్మ ఒక పక్క వేసి, రెండో పక్కన శుభ్రత గురించి వ్రాసిన బోర్డు, దుమ్ముకోట్టుకు పోయి ఉన్నది ఫోటో తీశాను. ఆ బోర్డులో వ్రాసినదానికి,ఆ బోర్డు ఉన్న పరిస్థితి చూస్తె, మనం సుద్దులు చెప్పుకోవటమే కాని ఆచరించటం లో శ్రద్ధ తీసుకోవటం లేదు అన్న విషయం స్పుటంగా తెలుస్తుంది. ( దిగువన ఉన్న ఫోటో )

ప్ర - సినిమాలలో నాటికీ, నేటికీ ఉన్న తేడాలు ఏమిటి?
జ - అలనాటి ప్రముఖ నటి శాంతకుమారి గారు చెప్పినట్టుగా ఈనాటి చిత్రాలు వర్ణచిత్రాలు అలనాటివి సువర్ణ చిత్రాలు. అలా అని పాతవన్నీ గొప్ప చిత్రాలూ కాదు, ఇప్పుడు వచ్చేవన్నీ కూడా చూడకూడనివీ కాదు. కాకపొతే పూర్వం మంచి చిత్రాలు ఎక్కువగా వచ్చేవి, ఇప్పుడు వందలో ఒకటో రెండో వస్తున్నాయి.

ప్ర - మన పురాణాలలోని ఘట్టాలను, అంశాలను ఆచరణలోకి ఎంతమేరకు ఆదర్శంగా తీసుకోవాలి?
జ - పెద్దలు చెప్పినవి, మనకు నచ్చినవి, తప్పకుండా ఆదర్శంగా తీసుకోవాలి. పురాణాల్లో ఆదర్శాలను ఎందుకు పాటించాలి అనుకోవటం సరైన పని కాదు. సమాజ పరిణామ క్రమంలోని అనుభవ సారం పురాణాల్లోకి వచ్చింది. ఈనాటి పరిస్థితులకు సరిపొయ్యే అనేక మంచి విషయాలు పురాణాల్లో ఉన్నాయి.

ప్ర - రామాయణ, భారత ,భాగవతాలను అందులోని పాత్రలను విమర్శించడం నేరమని భావిస్తారా
జ - విమర్శ వేరు, పనికట్టుకుని కోట్లమంది పవిత్రంగా భావించే గ్రంధాలను వితండ వాదంతో వెర్రి వ్రాతలు వ్రాయటం వేరు. విమర్శ విమర్శగా నేను స్వాగతిస్తాను కాని, తమ ఇజాన్ని ప్రచారం చేసుకోలేక, ఆప్రచారం విఫలమయ్యి, ఆ అక్కస్సుతో 'హిందూ మత గ్రంధాలను, పురాణాలను అదేపనిగా పెట్టుకుని విమర్శించటం నేరమనే' నేను భావిస్తున్నాను.  హిందూ మతంలో ఓర్పు ఎక్కువ, విమర్శ పెద్దగా పట్టించుకోరు. అదేదో హాస్యంగా చదివి పక్కన పడేసి వాళ్ళ మార్గాన వాళ్ళు చెయ్యదలుచుకున్నది చేస్తూనే ఉంటారు. కాని కార్టూన్ వేస్తేనే అతలాకుతలం చేసే స్థాయికి తమ విమర్శలతో హిందూ సమాజాన్ని నెట్టాలని కొంతమంది భావిస్తూ ఉండవచ్చు. కాని అలా ఎప్పటికీ జరగదు.

ప్ర - విమర్శపై మీ అభిప్రాయంవిమర్శ ఎలా ఉండాలి?
జ - విమర్శ అంటే ఏమిటి? ఒక విషయం మనకు నచ్చదు, లేదా ఒక అభిప్రాయంతో మనం ఏకీభవించము. అప్పుడు మన అభిప్రాయం చెప్పటమే విమర్శ. విమర్శ చెయ్యటంలో ఎవరి పద్ధతి వారిది. ఎవరి పరిణితి ని బట్టి వారు విమర్శ చేస్తూ ఉంటారు. విమర్శ అంటే ఇలాగే ఉండాలి అనే పిడివాదం చెయ్యలేను.

ప్ర - వ్యంగ్యానికి, కించపరచడానికి తేడా ఏమిటి?
జ - వ్యంగ్యం చెయ్యటంలో ఆవతలి వారిని అవమాన పరచాలన్న ఉద్దేశ్యం లేనంతవరకూ పరవాలేదు.  ఉద్దేశ్యం మాత్రం కించపరచటమే అయితే, ఆ వ్యంగ్యం అంతగా రాణించదు. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఆవతలివారి మాటలు వింటారు. చేసిన పనిలో తప్పు చెప్పేప్పుడు, మామూలుగా చెబితే వినని వాళ్ళ మీద వ్యంగ్యం తప్పకుండా పనిచేస్తుంది. కించపరచటానికి వ్యంగ్యమే అక్కర్లేదు. మాట విరుపులోనూ చెప్పే పద్ధతిలోనూ ఆవతలి వారిని కించపరచ వచ్చు. మన ఉద్దేశ్యం ముఖ్యం.

ప్ర - ఇంకా మీరు చెప్పదలచుకున్నది ఏమైనా ......?
జ - ఇంకానా ఇప్పటికేమరీ ఎక్కువ అయిపోయింది. కాని ఒక విషయం చెప్పకుండా ఈ ఇంటర్వ్యూ ముగిస్తే పూర్తి కాదు. బ్లాగుల్లో ఆగ్రిగేటర్లు ఉన్నాయి, బ్లాగులను సమీక్షించే ప్రక్రియా జరుగుతున్నది. కాని మీరు మీ వెబ్ సైట్ 'ప్రజ' లో బ్లాగర్లను ఇంటర్వ్యూ చేసే శీర్షిక ప్రవేశ పెట్టటం ఒక కొత్త పంథాకు దారి. ఇప్పటివరకూ ఇంటర్వ్యూ అంటే పత్రికల వాళ్ళు చేసేదే! మీరు చేస్తున్న ఈ ప్రయత్నం బాగున్నది. ఒక విషయం మీద వ్రాస్తూ ఉన్న బ్లాగర్లు, వారి అభిరుచులను, అభిప్రాయాలను తెలియచెప్పే అవకాశం తక్కువ. మీరు రకరకాల ప్రశ్నలు వేస్తూ బ్లాగర్ల మనోగతం తెలుసుకోవటానికి ఇంటర్వ్యూ విధానాన్ని ఎన్నుకున్నందుకు అభినందనలు. నన్ను మీ వెబ్ సైట్లో ఇంటర్వ్యూ చేసినందుకు ధన్యవాదాలు..
------------------------------------------------------------------------------------------------
పల్లెప్రపంచం సేకరించిన ప్రసాద్ గారి ఫోటోలు కొన్ని
--------------------------------------------------------------------------------------------
మీరు మీకు నచ్చిన బ్లాగరుని ఇంటర్వ్యూ చేయాలనుకుంటే మాకు వ్రాయండి. వివరాలకు ఇక్కడ నొక్కండి. శ్యామలీయం మాష్టారు ఇంటర్వ్యూ కోసం ఇక్కడ నొక్కండి.
                      -------------------------------------------------------------------------------------------

 - పల్లా కొండల రావు

Post a Comment

  1. కప్పగంతు శివరామప్రసాదు గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

    ReplyDelete
  2. Many more happy returns of the day Sir :)

    ReplyDelete
  3. Thank you Kondal Rao Garu for your Greetings.

    Thank you Aravind for your Greetings and special Thanks for making the interview look beautiful.

    ReplyDelete
  4. కప్పగంతు శివరాం ప్రసాద్ గారితో మీ ముఖాముఖి చాలా బాగుంది కొండలరావుగారు. మన శర్మగారి బ్లాగు తరువాత సాహిత్యాభిమాని బ్లాగే చాలా ఆసక్తిగా చదువుతూ వుంటా.అందించిన మీకు ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. @ లక్ష్మీ'స్ మయూఖ , ధన్యవాదములండీ.

      Delete
    2. ధన్యవాదాలు లక్ష్మి గారూ.

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top