మన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకే పంపుదాం!


మా మామయ్య ప్రభుత్వ పాఠశాలలో హిందీ పండితుడు. అతను తన కొడుక్కి మొదట్లో ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలనుకున్నాడు. ఉపాధ్యాయులు తమ సహోద్యోగుల పిల్లలకైతే పాఠాలు సరిగానే చెపుతారులే అని నమ్మకంతో ఉండేవాడు. కానీ అతని భార్య మాత్రం అందుకు ఒప్పుకోలేదు. లేబరోళ్ళ పిల్లల పక్కన ఉంటే మనవాడు చదవడు అని ఆమె గొడవ చేసి, తమ కొడుకుని దగ్గరలోని పట్టణంలో ఇంగ్లిష్ మాధ్యమ స్కూల్‌లో వెయ్యించింది.

పేదవాళ్ళకి చదువు అంత ముఖ్యం కాదు కనుక వాళ్ళకి మార్కులు తక్కువ వస్తాయనేది నిజమే. కానీ మా మామయ్య ప్రభుత్వ ఉద్యోగి. అతని కొడుకు కూడా తనకి ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకుని చదవగలడు. పేదవాళ్ళ పిల్లలు తన పక్కన ఉన్నా కూడా తన చదువు కొనసాగించగలడు. నిన్ను doctorనో, lawyerనో చేస్తానని చెప్పి కూడా అతన్ని చదివించొచ్చు. అతను పేదవాళ్ళ పిల్లలతో తిరిగి చదువు మానేస్తాడని భయపడక్కరలేదు. అయినా మా మామయ్య తన భార్య మాటలు విని, పట్టణంలో ఇల్లు అద్దెకి తీసుకుని, తన కొడుకుని ఇంగ్లిష్ మాధ్యమ స్కూల్‌లో వేసాడు.

నేను చదువుకున్నది ప్రైవేత్ స్కూల్‌లోనే. ప్రైవేత్ స్కూల్‌లలో పిల్లల్ని కొట్టి చదివిస్తారు కనుక అక్కడ పిల్లలకి మార్కులు ఎక్కువే వస్తాయి. కానీ ఆ స్కూల్‌లలో చదివే పిల్లలకి సామాజిక జ్ఞానం పెరగదు. వాళ్ళ ఇళ్ళలో కూడా తల్లితండ్రులు వాళ్ళని స్కూల్ పుస్తకాలు తప్ప ఏవీ చదవనివ్వరు కనుక వాళ్ళకి స్కూల్ పుస్తకాలలోనివి తప్ప వేరే విషయాలు తెలియవు.

నేను చదువుకునే రోజుల్లో IT ఉద్యోగాలు లేవు. కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కోసం కొట్టి చదివించేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం ఖర్చు తగ్గింపు కోసం ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్యని తగ్గించేసింది కానీ IT ఉద్యోగాల కోసం పిల్లల్ని కొట్టి చదివించడం జరుగుతోంది. ప్రభుత్వ & IT ఉద్యోగులు జనాభాలో కొన్ని లక్షల మందే ఉంటారు కానీ ఈ రెండు తెలుగు రాష్ట్రాల జనాభా కోట్లలో ఉంది. వస్తాయో, రావో తెలియని ప్రభుత్వ లేదా IT ఉద్యోగాల కోసం పిల్లల్ని కొట్టి చదివించడం అవసరమా?

పిల్లలకి ప్రభుత్వ పాఠశాలలే మంచివి. ప్రభుత్వ ఉపాధ్యాయుడు పిల్లలకి corporal punishment ఇస్తే అతని మీద విద్యాశాఖ అధికారులకి కంప్లెయింత్ ఇవ్వొచ్చు. ప్రైవేత్ పాఠశాలలో ఉపాధ్యాయుడు పిల్లలకి corporal punishment ఇస్తే తమ స్కూల్ పరువు కాపాడుకోవడానికి యాజమాన్యంవారే ఆ ఉపాధ్యాయుణ్ణి వెనకేసుకొస్తారు. ప్రభుత్వ పాఠశాలలో మార్కుల కోసం పిల్లలపై ఒత్తిడి చెయ్యరు కనుక అక్కడ చదివే పిల్లలకి మార్కులు తక్కువే వస్తాయి. కానీ మార్కుల కంటే మానసిక ఆరోగ్యమే ముఖ్యమని గుర్తుంచుకోవాలి. 

కనుక కేవలం వస్తాయో రావో తెలీని ఉద్యోగాలకోసం పిల్లల బంగారు భవిష్త్యత్తుని పాడు చేయడం మంచిది కాదు. వారి మానసిక వికాసానికి, సమస్యలను తట్టుకుని నిలిచే శక్తిని పెంచుకునే ఉత్తమ పౌరలను సమాజానికి అందించాలన్నా మనం పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపిద్దాం. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య కోసం, వసతుల కోసం అందరం కలసి పోరాడాలి, కృషి చేయాలి తప్ప, ప్రయివేటు పాఠశాలలను ప్రోత్సహించి మన పిల్లలపై మనమే వేటు వేయడం మంచిది కాదు.
- ప్రవీణ్ కుమార్

Post a Comment

  1. ఉద్యోగం కోసమే చదువు అన్న వైఖరి మారాలి. ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారికి నాయకత్వ లక్షణాలు, ఇతరులను అర్ధం చేసుకునే లక్షణాలు అబ్బినంతగా ప్రయివేట్ పాఠశాల విద్యార్ధులకు అబ్బవు. కేవలం పాఠాలను బట్టీయం వేయడానికి, బందెలదొడ్ల అడ్డాగా ప్రయివేటు యాజమాన్యాల నిర్వహణలోని పాఠశాలలుంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు వారి పిల్లలను ప్రయివేట్ స్కూళ్లలో చదివించడం దారుణమైన విషయం.

    ReplyDelete
    Replies
    1. కె.ఎన్.మల్లేశ్వరి గారు వ్రాసిన "శిశువాదం" కథ చదివాను. ఆ కథలో అమ్మాయి తల్లితండ్రులు మొదట్లో ఆమెని ఒక కార్పరేత్ స్కూల్‌లో వేస్తారు. అక్కడ అమ్మాయిపై ఒత్తిడి ఎక్కువ ఉండడం వల్ల ఆమెని స్కూల్ మార్పించి ఊరి చివరి బాల వికాస కేంద్రానికి పంపిస్తారు. నాకు తెలిసినంత వరకు ప్రైవేత్ స్కూల్ ఏదైనా అందులో చదువు ఒత్తిడి ఎక్కువే ఉంటుంది. స్కూల్‌ల యాజమాన్యాల మధ్య పోటీ ఉంటుంది కనుక పిల్లలపై చదువు ఒత్తిడి లేకపోతే తమ స్కూల్ నిలదొక్కుకోదు అని యాజమాన్యాలు అనుకుంటాయి.

      Delete
    2. విద్య గురించి వివేకానందుడు చెప్పిన విషయాలు:

      " బుర్రలలో విషయ బాహుళ్యాన్ని నింపి, గందరగోళం చేసి, జీవితంలో ఎన్నటికీ అర్ధం కాకుండా ఉండేది విద్య కాదు. శీలాన్ని రూపొందించి, వ్యక్తిని నిర్మించి, జీవితాన్ని తీర్చిదిద్దే భావనల అవగాహన మనకు ఉండాలి. ఆ భావనలను అవగతం చేసుకుని, వాటిని నీ శీలంలో, నీ జీవితంలో అంతర్భాగంగా రూపొందించుకొన్నట్లయితే ఒక గ్రంధాలయాన్నంతటినీ కంఠస్థం చేసినవాని కంటే నీవు ఎక్కువ విద్యావంతుడవైనట్లే "

      "సామాన్య జన సముదాయాన్ని జీవన సమరానికి సంసిద్ధం చేయని విద్య, సౌశీల్యశక్తిని, ఉదారభావనను, సింహ విక్రమాన్నీ వెలికి తీయని విద్య - విద్య అనిపించుకుంటుందా? వ్యక్తిని తన కాళ్ళ మీద నిలబడేలా చేసేదే నిజమైన విద్య."

      పైన చెప్పిన ప్రకారం విద్య అయితే మన ప్రభుత్వ పాఠశాలలో కూడా లభించదు. ప్రయివేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలు చాలా మెరుగైనా సిలబస్ మారాలి. వ్యక్తి శీలతను నేర్పే విద్య కావాలి. బట్టీలు బట్టి ఉద్యోగం రాకుంటే నాలుక గీసుకోవడానికి కూడా పనికి రాని డిగ్రీ సర్టిఫికెట్లను ఇచ్చేది విద్య కాదు.

      మొత్తం మన విద్యా వ్యవస్థలో చాలా మార్పులు రావాలి.

      Delete
  2. చాలా ప్రైవేత్ స్కూల్‌లలో లైబ్రరీ, లేబ్ లాంటి సౌకర్యాలు ఉండవు. అక్కడ మంచినీళ్ళూ, మరుగుదొడ్లూ మాత్రం ఉంటాయి. ఆ సౌకర్యాలు చూసే ప్రైవేత్ స్కూల్‌లు నయం అనుకుంటారు. తమ పిల్లలకి మార్కులు వస్తే చాలనీ, లైబ్రరీ & లేన్ లాంటివి అనవసరమనీ తల్లితండ్రులు అనుకుంటారు. స్కూల్ యజమానులు తల్లితండ్రుల సైకాలజీని దృష్టిలో పెట్టుకుని వ్యాపారం చేస్తారు. ఆ వ్యాపారులకి child psychology అనవసరమే.

    ReplyDelete
    Replies
    1. వ్యాపారం అంటేనే ఖచ్చితంగా లాభం మాత్రమే చూస్తుంది విలువలని కాదు. ఒకవేళ ఎవరైనా విలువలకోసం ప్రాకులాడితే వాడు పోటీప్రపంచంలో నిలబడలేడు. తల్లిదండ్రుల సైకాలజీ వ్యవస్థను బట్టే ఉంటుంది. అయితే వారిలో కూడా గతంతో పోలిస్తే ప్రయి'వేటు'ను గురించిన ఆలోచన మొదలయిందనిపిస్తోంది. ప్రయివేటు యాజమాన్యాల అతి క్రమశిక్షణతో ప్రాణాలు పోగొట్టుకున్న బిడ్డల తల్లిదండ్రుల వార్తలు, ఇంత ఖర్చుపెట్టినా తరువాత ఏమీ సాధించలేకపోవడం , కొందరు ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులు సైతం మంచి మార్కులు తెచుకోవడం వారిని ఆలోచింపజేస్తున్నాయి. అయితే ఎన్ని చెప్పినా ప్రభుత్వ పాఠశాలలో వసతులు, అన్ని రకాల భద్రతా భావం కలిగినపుడే ప్రయి'వేటు'ని ఆపగలరు.

      Delete
  3. నిజమే,విద్యావ్యవస్థలో మారాల్సినవి చాలా ఉన్నాయి.ఉద్యోగాల కోసం మాత్రమే పనికొచ్చే చదువు కన్నా చదువు పూర్తయ్యాక మార్కులతో,డిగ్రీతో సంబంధం లేకుండా తన కాళ్ళమీద తను నిలబడగలిగే విధంగా ఉండాలి.అంటే చదువు->ఉద్యోగం->ఉపాధి అనే ఒకే దారిలో పోకుండా వ్యక్తిత్వాన్ని మెరుగుపర్చే విధంగా ఉండాలి.ఈ చదువు పూర్తయ్యాక నేను యెట్లా అయినా బతకగలను అనే ఆత్మవిశాసం ఇచ్చేదిగా ఉండాలి,యెప్పటికి సాధ్యపడుతుందో మరి?

    ReplyDelete
    Replies
    1. < చదువు->ఉద్యోగం->ఉపాధి అనే ఒకే దారిలో పోకుండా వ్యక్తిత్వాన్ని మెరుగుపర్చే విధంగా ఉండాలి.ఈ చదువు పూర్తయ్యాక నేను యెట్లా అయినా బతకగలను అనే ఆత్మవిశాసం ఇచ్చేదిగా ఉండాలి >

      బాగుంది మీ కామెంట్. ఎప్పటికైనా మన విద్యావ్యవస్థలో ఆ విధమయిన మార్పులు రావాల్సి ఉన్నది.

      Delete
  4. కె.ఎన్.మల్లీశ్వరి గారు వ్రాసిన "శిశువాదం" కథ చదివిన తరువాతే నాకు ఇది వ్రాయాలనిపించింది. ఆ కథలో అమ్మాయిని ఆమె తల్లితండ్రులు బాగానే చూసుకుంటారు కానీ ఆమెకి స్కూల్‌లోనే ఒత్తిడి ఎదురవుతుంది. నిజజీవితంలో తల్లితండ్రులు కూడా పిల్లలపై ఒత్తిడి చెయ్యడం చూసాను. స్కూల్ యజమానులు తల్లితండ్రుల సైకాలజీని దృష్టిలో పెట్టుకుని వ్యాపారం చేస్తారు తప్ప పిల్లల సైకాలజీ వాళ్ళకి అనవసరమే.

    ఆ రచయిత్రి ప్రైవేత్ కాలేజ్‌లో లెక్చరర్, ఆవిడ భర్త ఒక contractor. బతకడానికి ప్రభుత్వ ఉద్యోగం ఒక్కటే మార్గం కాదని ఆ రచయిత్రికి తెలుసు, ఆవిడ దగ్గర చదువుకున్న విద్యార్థుల్లో కొంత మంది ఆవిడ కంటే ఐదు రెట్లు ఎక్కువ సంపాదించే ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరినా కూడా.

    కానీ నేను నా అనుభవాల్లో చూసినవి వేరు. 1990లో శ్రీకాకుళం పట్టణ జనాభా ఎనభై వేలే. కానీ అప్పట్లో కూడా ఆ పట్టణంలో ఇంగ్లిష్ మాధ్యమ స్కూల్‌లు ఉండేవి. అది జిల్లా కేంద్రం కావడం వల్ల అక్కడ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉండేవాళ్ళు. నేను చదివిన స్కూల్‌లో ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలే ఉండేవాళ్ళు. అక్కడి ఉపాధ్యాయులు పాఠాలు సరిగా చెప్పేవాళ్ళు కాదు. "మగ పిల్లలు చదవకపోతే హొటెళ్ళలో ప్లేట్‌లు కడుగుతారు, ఆడపిల్లలు చదవకపోతే ఇళ్ళలోఅంట్లు తోముతారు" అని భయపెట్టి చదివించేవారు. Hotel workers డబ్బులు లేక చదువుకోరు కానీ వాళ్ళు స్కూల్ ఎగ్గొట్టడం వల్ల hotel workersగా మారలేదు. పిల్లలకి చదువు నేర్పించడానికి వాళ్ళకి సమాజంపై తప్పుడు అభిప్రాయాలు కలిగించాల్సిన అవసరం లేదు. పూర్వం స్కూల్‌లు లేవు. బ్రాహ్మణులు తాటాకుల మీద పురాణాలు వ్రాస్తే క్షత్రియులు రాళ్ళ మీద శాసనాలు వ్రాసేవాళ్ళు. ఆంగ్లేయులు వచ్చిన తరువాత, అక్షరాలు వ్రాయడం వచ్చినవానికి కరణం ఉద్యోగం, ఐదో తరగతి చదివినవానికి పోలీస్ ఉద్యోగం, పదో తరగతి చదివినవానికి తహసీల్దార్ ఉద్యోగం ఇచ్చే పద్దతి మొదలైంది. ఇప్పుడు MBA చదివినవాళ్ళు కూడా పోలీస్ ఉద్యోగం కూడా దొరక్క రోద్‌ల మీద తిరుగుతున్నారు. అందరూ certificates కోసమే చదివితే ఇలాగే ఉంటుంది.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top