చిన్నూ , ఇంద బనానా తిను.
మామ్ నాకు బనానా ఇష్టం లేదు , ఆపిల్ కావాలి.
నాన్నా , డాడ్ కి ఫోన్ చేసి చెప్తాన్లే , ఆఫీస్ నుంచి వచ్చేప్పుడు ఆపిల్ తెమ్మని . మా చిన్నూ గుడ్ బాయ్ , ఈరోజు బనానా తింటాడు . అస్సలు మారాం చెయ్యడు , ఓకే?
ఓకే ,  మామ్.
దట్స్ గుడ్.
*********

హలో బావ గారూ , ఏవిటో ఈరోజు పొద్దుట్నుంచీ ప్రయత్నిస్తూనే ఉన్నా , వల కలవడం లేదు. అంతర్జాలం అస్సలు తెరుచుకోవడంలేదు . సమస్యాపూరణం దుంగ లో సమస్య ఏవిచ్చాడో తెలిసి చావట్లేదు, తవరి నిస్తంత్రీభాషిణికి పిలుపందించి తగలడదామనీ.....

హారినీ...రావుడూ, నువ్వటోయ్ , అదేవిటోనోయ్ మా మేజోపరి భోషాణం పరిస్థితి కూడా అల్లానే తగలడింది . మూషికం చచ్చిందో , కీలు పలక పాడయ్యీందో తెలిసి చావట్లేదు .

ఒరేయ్ అబ్బాయీ, ఈ భోషాణంతో నేను పడ్లేను, ఒక ఊరోపరి కానీ , హస్తోపరి కానీ కొని తగలడరా అంటే వింటాడా , మా శివుడు ? నిన్నకు నిన్న _ తెలుగేలా ఆంగ్లభాష తియ్య్డగనుండన్ _ అంటూ ఒహ వెటకారపు సమస్యనిచ్చి చచ్చాడా పెద్దమనిషి . దాన్ని పూరించలేక నాతలప్రాణం తోక్కొచ్చిందనుకో . ఈరోజేమిచ్చి తగలడ్డాడో మరి ! నేనూ అందుకేగా జుట్టు పీక్కుంటుండేది . ఆ శర్మగారి నిస్తంత్రీభాషిణికి చేసి తగలడు . తెలుసుకుని నాకూ తగలడు .

***********

హలో వదినా , ఈవినింగ్ సిక్స్ థర్టీకి మాటీవీలో వస్తుందే , అదే , ఈతరం ఇల్లాలు సీరియల్ మిస్సయ్యాను నిన్న . మా పక్కింటావిడ సుథేష్ణ లేదూ, తనిష్కలో బేంగిల్స్ కొనడానికి తీసుకెల్లిందిలే, నాకైతే ప్రజెంట్ ట్రెండ్స్ తెలుసుననీ..... సర్లే , సూర్య టీవీ కొన్నాడా , సూర్య మదర్  ఒప్పుకుందా , అసలేం జరిగిందోనని ఒహటే టెన్షన్ ఫీలవుతున్నాననుకో , కాస్తంత డీటెయిల్డ్ గా నేరేట్ చెయ్యీ .

*************

భాష పారుటేరు . భాష జనబాహుళ్యానికి సొంతం . జనబాహుళ్య వినిమయమే భాషకు పరమప్రయోజనం . తరతరాలుగా మన తల్లిభాష మన తెలుగుభాష వర్థిల్లాలి .

అరటి పండును బనానాగా, ఆపిల్ ను సీమరేగుగా మార్చొద్దు . అరటిపండునూ , ఆపిల్ నూ ఎట్లవట్ల వాడుకుందాం.
ఓరుగంటినీ , ఒంటమిట్టనూ ఏకశిలానగరాలుగా సంస్కృతీకరించి , చక్రాయుధుణ్ణి చుట్టుకైదువుజోదుగా తెనిగించినంత మాత్రాన వాడుకలోకితీసుక రాగలిగేరా ?

రైలు , రోడ్డు లాగే కంప్యూటర్ , టీవీ , ఇంటర్ నెట్ , ఫోన్ , మొదలైన పేర్లను తెనిగించబోయి , సంస్కృతీకరించి అంతర్జాలాలూ , మూషికాలూ చెయ్యాల్నా !

మన భాషలో చేరి విరివిగా వినిమయమయ్యే ఇతర భాషల పదాలు ఎట్టివట్ల వాడుకోవడం మన భాషకూ , మనకూ ప్రయోజనకరం . మాతృభాషపై కుహనా మమకారంతో ఆధునిక పరికరాల అసలు పేర్లను నకిలీ చేస్తే కృతకమై , వికృతభాష తయారౌతుంది .

అట్లనే వినియోగంలో ఉన్న తెలుగు పదాలకు బదులు  ఆంగ్లపదాలను వాడి , వాటిని వాడుకలో లేకుండా చేయడం తరవాతి తరాలకు ద్రోహం చెయ్యడమౌతుంది .

            నా తెలుగు జాతికంతటికీ మాతృభాషా శుభాభినందనలు .
..... వెంకట రాజారావు . లక్కాకుల
--------------------------------------------------
*Republished

మీరూ జనవిజయం శీర్షిక కు రచనలు పంపవచ్చు. మెయిల్ ఐ.డి : kondalarao.palla@gmail.com

Post a Comment

  1. మొబైల్ దుకానానికి వెళ్ళి "నాకు నాలుగవ తరం చరవాణి కావాలి" అని అడిగే ధైర్యం ఎవరికీ ఉండదులే.

    ReplyDelete
  2. "మేజోపరి", "ఊరోపరి", "హస్తోపరి" ...... "సుప్పర్" ఉంది మాస్టారూ 😀😀 (చివర్లో "గా" అనడం ఏనాడో పోయింది)
    --------------------

    // "వినియోగంలో ఉన్న తెలుగు పదాలకు బదులు ఆంగ్లపదాలను వాడి , వాటిని వాడుకలో లేకుండా చేయడం తరవాతి తరాలకు ద్రోహం చెయ్యడమౌతుంది ." //

    ఇదే ప్రస్తుత పరిస్ధితికి ప్రధాన కారణం. నిస్సందేహంగా ద్రోహమే. కానీ "చెయ్యడమౌతుంది" అంటారేమిటి? ఆ ద్రోహం ఇప్పటికే జరిగిపోయిందని నా అభిప్రాయం. ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో మొదలైన ఈ ధోరణి ప్రైవేట్ టీవీ ఛానెళ్ళు రావడంతో (ముఖ్యంగా వెరైటీగా మాట్లాడుతున్నామనుకునే భ్రమలో ఉన్న ఆ ఏంకరమ్మల, ఏంకరయ్యల పదప్రయోగాలతో .... వాళ్ళూ అటువంటి స్కూళ్ళల్లోనే చదివుంటారు బహుశః) మరింత బలపడిందనిపిస్తోంది. మరొకటి ... మార్కులు తేలికగా వస్తాయనే ఆశతో స్కూళ్ళల్లో తెలుగు బదులు సంస్కృతాన్నో మరో భాషనో తీసుకోవడం కూడా ఒక కారణం అని నాకు తోస్తోంది. ఆ రకం విద్యార్థులకు మార్కుల కోసం ఎంచుకున్న ఆ పరాయిభాష పెద్ద గొప్పగా ఏమీ రాదు, తెలుగు ఎలాగూ రాదు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న మీకు ఈ ధోరణి గురించి మరింత బాగా తెలిసుంటుంది. చిన్న ఊళ్ళల్లో పరిస్ధితి ఇంకా అంత అధ్వాన్నంగా తయారవలేదేమో గానీ నగరాల్లో మాత్రం బాగా భ్రష్టు పట్టిందనే అనిపిస్తోంది.

    మాతృభాషాజ్ఞానం ఇప్పటికే అధోముఖం పట్టేసిందని, ఆ పతనాన్ని ఆపడం కష్టమనీ నాకనిపిస్తుంది ..... నాది నిరాశావాదం అనుకున్నా సరే.

    ReplyDelete
  3. మేజ్ అనేది పెర్సియన్ పదం. పెర్సియన్ పదాలకి సంస్కృత పదాలు సంధి అవ్వవు.

    ReplyDelete
    Replies
    1. సంధి ప్రయోజనం వేగోచ్చారణం . ఏభాషాపదాలైనా మన వాడుకలో ఉన్నప్పుడు , వేగోచ్చారణ జరగడం కద్దు . ఉచ్చారణలో ఇదొక ప్రయోజనం .

      Delete
  4. అసలు తెలుగు పదాలు వద్దు అని చెప్పడం కన్నా...దుర్మార్గం ఇంకొకటి లేదు...కానీ కొత్త పదాల కల్పన జరగాలి.అది మనమందరం ఆదరించాలి మరియు వ్యహరించాలి. మనం ఉన్నవే చేయకపోతే ఎట్లా..?

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top