కంది శంకరయ్య గారు. తెలుగు సాహిత్యంపైనా, పద్యరచన, సమస్యా పూరణాలపైనా ఆసక్తి ఉన్నవారందరికి అత్యంత ఇష్టులు. చాలామంది ఆయనను గురుతుల్యులుగా భావించి శంకరయ్యగారి శిష్యులమని చెప్పుకుంటారు. శంకరయ్యగారు మాత్రం వారిని తన మిత్రులని చెపుతారు. ఇంతమంది మిత్రులను సంపాదించి పెట్టిన శంకరాభరణం బ్లాగులో సమస్యా పూరణలతో పాటు ఛందో వ్యాకరణ పాఠాలు, చమత్కార పద్యాలు, పద్యరచన తదితర అంశాల ఆధారంగా ఆరేళ్లుగా క్రమం తప్పకుండా విజయవంతంగా బ్లాగింగ్ చేస్తున్న ఆయనకు మొదట్లో కంప్యూటర్ వాడకమే సరిగా రాదు. ఆంధ్రజ్యోతిలో వలభోజు జ్యోతి గారి వ్యాసం ఆధారంగా బ్లాగింగ్ మొదలెట్టిన ఆయన ఈ రోజు ప్రముఖ బ్లాగరుగా ఎదిగారు. దేశ విదేశాలలో అంతర్జాలంలో పరిచయం అయ్యారు. దీనికి కారణం పద్యంపై, సమస్యా పూరణంపై ఆయనకున్న ఆసక్తి మాత్రమే. తెలుగు భాషకు, సంప్రదాయ తెలుగు కవిత్వానికి, పద్య కవిత్వానికి సేవచేస్తున్న శంకరయ్య గారు ఆ దిశగా మరింత కృషి చేస్తారని ఆశిద్దాం. ఆయన ఎపుడూ తనకు పేరు ప్రఖ్యాతులు రావాలని కోరుకునే మనిషి కాదు. కవిసమ్మేళనాలలో పాల్గొనలేదు. సాహిత్యసమావేశాలలో వేదిక లెక్కలేదు. శంకరాభరణం బ్లాగును, అందులోని సాహిత్య వ్యాసంగాన్ని దేశవిదేశాల్లోని సాహితీప్రియులు అభినందిస్తున్నా తన గురించి కాని, తన బ్లాగు గురించి కనీసం ఆయన స్వస్థలం వరంగల్ సాహితీవేత్త లెవరికీ తెలియదు. తన గురించి ప్రచారానికి అంతగా ఇష్టపడని ఆయన పత్రికలవారడిగినా ప్రచారం చేసుకోవడానికి ఇష్టపడలేదని తెలిసింది. పల్లెప్రపంచం కు కూడా చాలాసార్లు పట్టుబట్టిన తరువాత మాత్రమే ఇంటర్వ్యూ ఇచ్చారు. పరిమిత అంశాలపై శంకరయ్య మాష్టారితో 'పల్లెప్రపంచం' జరిపిన ఇంటర్వ్యూ ఇది. 



ప్ర -  మీ పేరు?
జ -  కంది శంకరయ్య

ప్ర - మీ పుట్టిన తేది? వయస్సు?
జ.  17 - 7 - 1950, 65 సం||

ప్ర - మీ తల్లిదండ్రుల వివరాలు?
జ - మా నాన్న వీరస్వామి. అమ్మ కీ.శే. మల్లమ్మ. మొత్తం పన్నెండు మంది సంతానం. అయిదుగురం అన్నదమ్ములం, ఏడుగురు అక్కాచెల్లెళ్ళు. నాన్న కొద్దిగా చదువుకున్నాడు. ప్రైవేటుగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాడు. మమ్మల్ని పోషించడానికి ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు.

ప్ర - మీ జన్మస్థలం?
జ -  వరంగల్.

ప్ర - ప్రస్తుత నివాసం?
జ -  హైదరాబాదులోని ఒక వృద్ధాశ్రమం.     

ప్ర - విద్యార్హతలు - విద్యాభ్యాసం వివరాలు?
జ - హెచ్.ఎస్.సి. తర్వాత తెలుగులో డి.ఓ.యల్., ఆ తర్వాత బి.ఓ.యల్. చదివి పండిట్ ట్రెయినింగ్ పూర్తి చేశాను. ఆ తర్వాత ప్రైవేటుగా ఎం.ఏ (తెలుగు) పాసయ్యాను. ఎం.ఫిల్. అసంపూర్ణం.      

ప్ర - మీ వివాహం, ఇతర కుటుంబ వివరాలు?
జ - నా వివాహం 1973లో జరిగింది. భార్య పేరు శాంతి. ఎక్కువగా చదువుకోలేదు. ఇద్దరు పిల్లలు. కుమారుడు క్రాంతి కుమార్ (నేనేదో వామపక్ష భావాలు కలిగి ఈ పేరు పెట్టలేదు. వాడు జనవరి 14 సంక్రాంతినాడు పుట్టినందువల్ల ఆ పేరు పెట్టాను) యం.సి.ఏ. చదివాడు. సాఫ్టువేర్ ఉద్యోగాల ప్రయత్నాలు ఫలించలేదు. వరంగల్ లోనే ఒక ఇనిస్టిట్యూట్లో ట్యూటర్గా పనిచేస్తున్నాడు. కోడలు కల్పన. వారికొక కుమారుడు. నా కుమార్తె స్వాతి. తను కూడా యం.సి.ఏ. చేసింది. అల్లుడు క్రాంతికుమార్ సాఫ్టువేర్ ఉద్యోగి. వాళ్ళకొక కుమారుడు, కుమార్తె. సైనిక్పురిలో ఉంటారు.   

ప్ర - మీ ఉద్యోగ వివరాలు?
జ - 1972 నుండి 1980 వరకు వరంగల్ లోని డట్టన్స్ హైస్కూల్ లో తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేసాను. 1980 నుండి 2008 వరంగల్లోనే ప్రభుత్వ సహాయక మహబూబియా పంజెతన్ బాలుర ఉన్నత పాఠశాలలో గ్రేడ్-1 తెలుగు పండితుడిగా పని చేసి ఉద్యోగ విరమణ చేశాను.

ప్ర - మీ బ్లాగు పేరు?
జ - ‘శంకరాభరణం’


ప్ర - మీ బ్లాగుల లక్ష్యం ఏమిటి?
జ -  నా బ్లాగు లక్ష్యంపై నాకు నిర్ణీత అభిప్రాయం ఏదీ లేదు. నేనేదో తెలుగు భాషకు, సంప్రదాయ తెలుగు కవిత్వానికి, పద్య కవిత్వానికి సేవచేస్తున్నానంటారు మిత్రులు.   

ప్ర - మీకు బ్లాగు వ్రాయాలని కోరిక ఎలా కలిగింది?
జ - రిటైరైన తర్వాత కాలక్షేపానికి ఇంటర్ నెట్ లో తెలుగు బ్లాగులు చూస్తూ ఉండే వాడిని. అప్పటికి నా కంతగా కంప్యూటర్ను ఉపయోగించడం తెలియదు. ఒక ఆదివారం ఆంధ్రజ్యోతిలో ‘మీరూ బ్లాగుడుకాయలే’ అని జ్యోతి వలబోజు గారి వ్యాసం చదివాను. అందులో బ్లాగు ఎలా ప్రారంభించాలో వివరంగా ఇచ్చారు. వెంటనే ‘Kandi Shankaraiah Blog' అని మొదలు పెట్టి తెనాలి రామకృష్ణుని ‘నరసింహ కృష్ణరాయని...’ పద్యాన్ని పోస్ట్ చేశాను. ఆ తరువాత ఏం చేయాలో, ఎలా వ్రాయాలో తెలియక మళ్ళీ సంవత్సరం దాకా దాని జోలికి వెళ్ళలేదు. ఈలోగా ఆంధ్రామృతం, రౌడీరాజ్యం, ఊకదంపుడు, తురుపుముక్క, డా. ఆచార్య ఫణీంద్ర గారి బ్లాగుల్లో అప్పుడప్పుడు ఇచ్చిన సమస్యలను పూరిస్తూ ఉండేవాణ్ణి. రోజూ కొత్త సమస్యలెమైనా ఇచ్చారా అని వారి బ్లాగులు చూస్తూ ఉండే వాణ్ణి. వాళ్ళు తరచుగా ఇచ్చేవాళ్ళు కాదు. నిరుత్సాహపడేవాణ్ణి. నాలాగే సమస్యలకోసం ఎదురుచూసే వాళ్ళు ఉంటారు కదా.. నేనే నా బ్లాగులో ప్రతిరోజూ క్రమం తప్పకుండా సమస్యలు ఇస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది. వెంటనే ఆచరణలో పెట్టాను. నా పేరు కలిసి వచ్చేలా బ్లాగుకు ‘శంకరాభరణం’ అని పేరు మార్చాను. నిజానికి ఆ పేరు సంగీతానికో, భక్తికో సంబంధించిన బ్లాగుకు పెట్టవలసింది. నా బ్లాగులో విషయాలకు, ఆ పేరుకు తాదాత్మ్యత లేదు. సమస్యా పూరణలతో పాటు ఛందో వ్యాకరణ పాఠాలు, చమత్కార పద్యాలు, పద్యరచన తదితర అంశాలను నిర్వహిస్తున్నాను. బ్లాగు రూపకల్పనలో జ్యోతి వలబోజు గారు ఎంతో సహకరించారు.    

ప్ర -  మీ బ్లాగు అనుభవాలు?
జ - ఈ బ్లాగు నా కెందరో మిత్రులను (వాళ్ళేమో శిష్యులం అంటారు)  సంపాదించి పెట్టింది. దాదాపు ఆరేళ్ళుగా క్రమం తప్పకుండా రోజూ పోస్ట్ ఉండే బ్లాగుగా తెలుగు బ్లాగు ప్రపంచంలో నాకొక గుర్తింపు తీసుకువచ్చింది. 

ప్ర -  బ్లాగర్ గా ఎదురైన ఆటంకాలు ఏమిటి?
జ -  ఏమీ లేవు. కాకుంటే కొన్ని అజ్ఞాత వ్యాఖ్యలు నన్నూ , మిత్రులనూ బాధ పెట్టాయి. దాంతో అజ్ఞాత వ్యాఖ్యలకు బ్లాగులో అవకాశం లేకుండా చేశాను. 

ప్ర - సీనియర్ బ్లాగర్ గా మీ అనుభవాలు?
జ -  చెప్పుకో తగ్గ అనుభవాలు ఏమీ లేవు.

ప్ర - తెలుగు బ్లాగర్లకు మీరిచ్చే సలహాలు ఏమిటి?
జ - సలహాలిచ్చే స్థాయి నాకు లేదని సవినయంగా మనవి చేసుకుంటున్నా.  

ప్ర - మీ బ్లాగులో మీ పోస్టులలో మీకు నచ్చినవి?
జ - దాదాపుగా అన్నీ... 

ప్ర - ఇతర బ్లాగులలో మీకు నచ్చినవి?
జ - ఆంధ్రామృతం, డా. ఆచార్య ఫణీంద్ర బ్లాగులు, మధురకవనం, బ్లాగుగురువు ఇతర సాహిత్య సంబంధమైన బ్లాగులు.  

ప్ర - బ్లాగు ప్రపంచంలో ఎదురైన ఆటంకాలు? ఇబ్బంది అనిపించిన సందర్భాలు?
జ - ఏమీ లేవు.

ప్ర -  తెలుగు బ్లాగుల అభివృద్ధికి మీరిచ్చే సూచనలు?
జ - ప్రస్తుతానికి మన్నించండి.

ప్ర - బ్లాగుల వల్ల ఉపయోగాలేమని మీరు అనుకుంటున్నారు?
జ - చాలా ఉన్నాయి. గుండు మధుసూదన్ గారు తమ ఇంటర్వ్యూలో తెలిపిన అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను.

ప్ర - మీ హాబీస్  ?
జ - పుస్తక పఠనం, బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూడడం.

ప్ర - మీ అభిమాన రచయిత ?
జ - జేమ్స్ హాడ్లీ ఛేజ్.

ప్ర - మీకు నచ్చే రచనలు?
జ - ప్రత్యేకంగా ఇవి అని ఏవీ లేవు. అన్నీ..

ప్ర - మీకు ఇష్టమైన ఆహారం?
జ - శాకాహారం, సీతాఫలాలు.

ప్ర - జీవితంలో అన్నింటికన్నా ముఖ్యమైనది ఏది?
జ - చెప్పలేను.

ప్ర - మీ జీవితంలో అన్నింటికంటే ముఖ్యమైనదేది అంటే ఏమి చెప్తారు?
జ -  చెప్పలేను.

ప్ర - మీకు ఇతరులలో నచ్చేవి ఏవి? నచ్చనివి ఏవి?
జ -  చెప్పలేను

ప్ర - మీలో మీకు నచ్చేవి ఏవి? నచ్చనవి ఏవి?
జ -  చెప్పలేను

ప్ర - మీ రోల్ మోడల్ ఎవరు?
జ - ఎవరూ లేరు.

ప్ర - మీకు నచ్చే వృత్తి?
జ - ఉపాధ్యాయ వృత్తి. 



ప్ర - మీరు డిప్రెషన్ కు గురైనప్పుడు రీచార్జ్ కావడానికేమి చేస్తారు?
జ - మాయాబజార్, మిస్సమ్మ లాంటి సినిమాలు చూస్తాను.

ప్ర - నేటి యువతకు మీరిచ్చే సలహాలు ఏమిటి?
జ - సలహాలిచ్చేంత గొప్పవాణ్ణి కాదు. మన్నించండి.

ప్ర - ఇతరులను నొప్పించకుండా మాట్లాడాలంటే ఏమి చేయాలి?
జ - నా కున్న గుణం అదే. అది సహజంగానే వచ్చింది. 

ప్ర -  మీ లక్ష్యం ఏమిటి?
జ - ఏమీ లేదు. 

ప్ర - మీ అభిమాన నాయకుడు?
జ - ఎవరూ లేరు.

ప్ర - మీకు నచ్చిన సినిమా  ?
జ - పాత బ్లాక్ అండ్ వైట్ తెలుగు, హిందీ సినిమాలన్నీ.

ప్ర - మీ అభిమాన నటీ నటులు ఎవరు?
జ - ఎన్టీఆర్, ఏఎన్నార్, సియెస్సార్, ఎస్వీఆర్, సావిత్రి, సూర్యకాంతం, రాజేంద్రప్రసాద్.

ప్ర - ఆధ్యాత్మికతకు మీరిచ్చే నిర్వచనం?
జ - చెప్పలేను.

ప్ర - మతం పై మీ అభిప్రాయం?
జ - చెప్పలేను.

ప్ర - సనాతన ధర్మం పై మీ అభిప్రాయం?
జ - చెప్పలేను.

ప్ర - తెలుగు భాషపై మీకు ప్రత్యేక ప్రేమ ఏర్పడడానికి కారణం?
జ - హైస్కూల్లో మాగురువు గారు చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల బోధన వల్ల, చిన్నప్పటినుండి మా అక్కయ్య అలవాటు చేసిన పుస్తకం పఠనం వల్ల.

ప్ర - తెలుగు భాష అభివృద్ధికి మీవంతుగా ఏమి చేస్తున్నారు?
జ - నేనేమీ చేయడం లేదు.. చేస్తున్నా నంటారు మిత్రులు.. నిజమే కామోసు అనుకుంటాను.

ప్ర - ప్రస్తుత రాజకీయాలపై మీ అభిప్రాయం?
జ - రాజకీయాలపై నాకు ఏమాత్రం ఆసక్తి లేదు.

ప్ర - తెలుగు సాహిత్యంపై మీకు పట్టు ఉండడానికి కారణం?
జ - పుస్తక పఠనం, నేను చదివిన కోర్సు.

ప్ర - మీరు చెప్పదలచుకున్న ఇతర అంశాలు?
జ - ప్రస్తుతానికి ఏమీ లేవు.. ధన్యవాదాలు.
- పల్లా కొండల రావు.
-------------------------------------------------------------------------
మీకు నచ్చిన బ్లాగరును ఇంటర్వ్యూ చేయాలనుకున్నా, మీకు నచ్చిన ఇంటర్వ్యూని అందరితో పంచుకోవాలనుకున్నా వివరాలకు ఇక్కడ నొక్కండి. ప్రజలో ఇంటర్వ్యూ పోష్టుల వివరాలకోసం ఇక్కడ నొక్కండి.
--------------------------------------------------------------------------

Post a Comment

  1. శంకరయ్య గారి బ్లాగును చూసే వాళ్ళలో నేనూ ఒకడిని.దీనివల్ల రోజూ పద్యాలు వ్రాసే అలవాటు అయ్యింది.శంకరయ్య గారిని గూర్చిన విషయాలు మీ ఇంటర్వ్యూ ద్వారా తెలిసినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. @ Rama Krishna Murthy Renduchintala గారు, ధన్యవాదములు. మీలాగా ఆయనకు చాలామంది మిత్రులయినట్లున్నారు శంకరాభరణం ద్వారా.

      Delete
  2. చిన్నప్పుడెప్పుడో నేర్చుకున్న తెలుగును , ఛందస్సును , పద్యాలను వదలివేసాను. అనుకోకుండా కంద పద్యాలు నోటికి దొర్లడము చూసి పాత ఛందస్సు , గణాలు చూసుకొని పద్యాలను వ్రాయడము మొదలు పెట్టినా , శంకరాభరణములో పూరణలు చెయ్యడము వలన తెలుగు భాషలో మనము సామాన్యముగా చేసే తప్పులు , పద్య రచనలో దోషాలేమిటొ గురువు గారి వలన నేర్చుకున్నాను. పద్యాలు వ్రాసే ఓపిక తగ్గినా ప్రాత సాహిత్యముపై మక్కువ ,ఆసక్తి పెరిగాయి. గురువుగారు నిరాడంబరులు , పూజ్యనీయులు. వారు తెలుగుసాహిత్యానికి ఎనలేని సేవ చేస్తున్నారు.

    ReplyDelete
    Replies
    1. @ గన్నవరపు నరసింహ మూర్తి గారు, శంకరయ్య గారి శంకరాభరణం బ్లాగు వల్ల మీలాగా చాలామంది ప్రయోజనం పొందారనుకుంటాను. ధన్యవాదములు.

      Delete
  3. గురువుగారి గురించిన విశేషాలు తెలిపిన ముఖాముఖి ఇది ఈ మీ ముఖాముఖి తో తెలుగు పద్య ప్రేమికుల గుండెల్లో గురువుగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న తెలుగు భాషకు తెలుగు పద్యానికి ఎనలేని సేవలనందించుతూ తెలుగుతల్లి కీర్తిపతాకాన్ని చిరస్థాయిగా వినువీధులలో రెపరెప లాడించే స్ఫూర్తిని నింపుతున్నగురువుగారి నమ్రత వినయశీలతకు ముగ్దుడనయ్యాను..... మీకు మా గురువుగారికి అభినందనలు తెలుపుతూ .........

    ReplyDelete
    Replies
    1. @ v.s.anjaneyulu sharma గారు, ధన్యవాదములు.

      Delete
  4. ప్రచురించిన మీకు ధన్యవాదముప్రతిరోజు శంకరాభరణంబ్లాగ్ చూసే వారిలో నేనొకర్తెను.శ్రీ శంకరయ్యగారి బ్లాగ్ వల్ల చిత్రాలకు పద్యాలు వ్రాయగల్గుతున్నాను.సమస్యలను పూరించ గల్గుతున్నాను.ఎంతో మంది చేత పద్య రచనలు చేయిస్తున్న శ్రీ శంకరయ్యగారికినమస్కారములు.Dr.B UMADEVI

    ReplyDelete
    Replies
    1. ఉమాదేవి గారు, శంకరయ్య గారి బ్లాగు వల్ల పద్యాలు వ్రాయగలుగుతున్న వారిలో ఒకరిగా ఉన్న మీకు ప్రజ తరపున అభినందనలు. వ్యాఖ్యకు ధన్యవాదములు.

      Delete
  5. మా గురువుగారి ఇంటర్యూ చదివి చాలా సంతోషించాను..ఎంత ఎదిగినా ఒదిగి వుండే నిరాడంబరతత్వం గురువుగారిది.
    నేను గత రెండు సంవత్సరాలుగా శంకరాభరణంలో క్రమం తప్పక పద్యములు వ్రాస్తుంటాను.. శంకరాభరణం చూసేటప్పటికి 10th లో వదిలేసిన చందస్సు కొద్దిగా గుర్తు.. పద్యరచనలో తప్పటడుగులు వేసే స్థితినుండి , చందోబద్ధంగా పద్యములు వ్రాసే స్ధాయికి చేరుకున్నానంటే అది కేవలం శంకరయ్య గురువుగారి తర్ఫీదు, ప్రోత్సాహమే కారణం. తప్పలను సరిదిద్ది పద్యరచన పట్ల భయాన్ని కాక ఆశక్తి కల్గించే విధంగా ఆయన చూపే మెలకువలు, నేర్పు , ఒక్క రోజు కూడా ఆగకుండా నిరంతరాయంగా శంకరాభరణమును నడిపిస్తూ... ప్రతీ రోజు మాపద్యములును పరిశీలిస్తూ ....సరిదిద్దుతూ ఒక బ్లాగుని ఓ స్కూల్ లా.. ఓ యూనివర్సిటీ లా ...పట్టుదలతో దీక్షతో నడిపిస్తున్నారంటే అది ఒక్క శంకరయ్య మాస్టారికి మాత్రమే సాద్యం.. ఆయన ఇంటర్యూ తీసుకున్నమీకు, మా గురువుగారికి ధన్యవాదములు...

    ReplyDelete
    Replies
    1. sailaja గారు, శంకరాభరణం బ్లాగు ద్వారా మీ వంటి శిష్యులు మరెందరినో శంకరయ్య మాష్టారు తయారుచేయాలని , తెలుగు పద్యానికి , వ్యాకరణానికి వెలుగులు ప్రసరింపజేయాలని ఆశిస్తున్నాను. వ్యాఖ్యకు ధన్యవాదములు.

      Delete
  6. శ౦కరయ్య గురుదేవుల వారిబ్లాగుకు పరిచయ మేర్పడడమునా అదృ ష్టముగాభావిస్తున్నాను కారణ భూతులు శ్రీ అబ్బరాజు రమణ గారు
    శంకరయ్యగారు నాపద్యాలలోని వ్యాకరణ దోషాలను
    సరిచేసి తగినసూచనలిచ్చి నాకు మార్గదర్శకులైనారు

    ReplyDelete
    Replies
    1. Timmaji Rao Kembai గారు, వ్యాఖ్యకు ధన్యవాదములు. పద్య రచనకు మీ వంతు కృషి కొనసాగడానికి శంకరాభరణం ఎప్పటిలాగే తోడ్పాటునిస్తుందని ఆశిస్తున్నాను.

      Delete

  7. శంకరయ్య గారి తో ముఖాముఖీ ఎంత చప్ప గా ఉందో, వారి బ్లాగు శంకరాభరణం అంత మెప్పుగా ఉంది ! దీన్నే అంటారేమో నిండు కుండ తొణకదు అని !

    కొంతైనా ఆ చెప్పలేను గట్రా వాటి కి సమాధానాలు ఇవ్వవలె అయ్యవారు :౦ జేకే !

    చాలా బాగుందండీ !

    తెలుగు బ్లాగు లోకం లో నిరవధికం గా రోజు తప్పక టపా పడే ఏకైక ("మేటరు' ఉన్న) బ్లాగు శ్రీ కంది వారి శంకరా భరణం !

    బ్లాగర్లు రౌండు రౌండు గా జిలేబీల లెక్ఖన అతి పెద్ద టపాలు వ్రాయుదురు ! ఒకటి అరా కామింటులు వచ్చును !

    శంకరాభరణం వారు ఒక వాక్యమే టపా గా వ్రాసెదరు ! టప టప మని కామింటు వర్షముల్ కురియును ! అదియే వారి బ్లాగు గొప్ప "ధనము" !

    విశ్రామ పండితుల వారు, శ్రామికులు !

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. < శంకరాభరణం వారు ఒక వాక్యమే టపా గా వ్రాసెదరు ! టప టప మని కామింటు వర్షముల్ కురియును ! > బాగా చెప్పారు జిలేబి గారు. అదే శంకరయ్య మాష్టారు ప్రత్యేకత.

      < శంకరయ్య గారి తో ముఖాముఖీ ఎంత చప్ప గా ఉందో, వారి బ్లాగు శంకరాభరణం అంత మెప్పుగా ఉంది ! దీన్నే అంటారేమో నిండు కుండ తొణకదు అని ! >

      కొన్ని అనివార్య కారణాల వలన శంకరయ్య మాష్టారి ఇంటర్వ్యూ అసంపూర్ణంగా , అసంతృప్తిగా పూర్తి చేయడం జరిగిందని మనవి. సాహిత్యం, పద్యాలు, సమస్యా పూరణాలపై కొన్ని , ఇతరత్రా కొన్ని ప్రశ్నలు ప్లాన్ చేసుకున్నాను. పాఠకుల ప్రశ్నలకు సమాధానాలు ఇప్పిద్దామనుకున్నాను. కానీ వీలు పడలేదు. నాకు కూడా ఇంటర్వ్యూ ఇంకా బాగా చేయాలని ఉన్నా ప్రస్తుతానికి అలా జరిగింది.

      Delete
    2. శంకరాభరణం బ్లాగు చూసి కుళ్ళుకునే చాన్స్ లేదు,అనామకులు అడుగుపెట్టే సాహసం కూడా చేయలేరు,మనవళ్ళకీ,మనవరాళ్ళకీ చక్కని తెలుగు నేర్పించవచ్చు,పద్యాల పూరణలో ఆరోగ్యకరమైన పోటీ, నాకు మాత్రం పద్యాలూ,చందస్సులూ రావేమిటా అన్న బాధ.... వెరశి పూరణలు ఎలా వ్రాస్తున్నారా అని పరిశీలించడం మాత్రం చేయగలుగుతున్నాను.

      Delete
    3. ఉంటారండీ.....నీహారిక గారు, శంకరాభరణం వంటి బ్లాగును చూసి శంకరయ్య గారి వంటి సాధు జీవులకి లభించే కీర్తి చూసి కుళ్ళుకునేవారూ ఉంటారు. బయటపడేలా కుళ్లుకుంటే ఇలాంటి విషయాలలో మం(ది)ద సపోర్ట్ దొరకదు కనుక లోలోపలే కుళ్ళుకుంటారు. ఇది మరీ విపరీతమైన కుళ్ళు బాధ మరి.

      Delete

  8. శంకరాభరణం కొలువు లో బుడతడి తెలుగు చదువు : - బుజ్జి పండు శంకర విజయం లింకు :

    http://funzilebi.blogspot.com/2011/12/blog-post.html

    ReplyDelete
  9. "శంకరాభరణము" దీనిని బ్లాగు అనడం కన్నా
    "ఏకోపాధ్యాయ పాఠశాల "అనడమే సముచితం

    శంకరయ్య గారికి తెలుగు సాహిత్యం పై నున్న మక్కువకు
    నిర్విరామంగా దీనిని నిర్వహించడమే-నిదర్శనం.

    ఆయన అనారోగ్యముతో వైద్యశాలలో నున్నప్పటికీ
    బడి నడపడం మానరు.విద్యుత్తు సమస్య రానీ,
    కంప్యూటరు మొండికెయ్యనీ , ఇతరత్రా ఏ సమస్య రానీ
    ఏ మాత్రం లెక్క చెయ్యకుండా బడి కార్యక్రమం నిర్విఘ్నంగా
    నిరాఘాటంగా కొనసాగిస్తారు.
    ఇది ఆయన దీక్షకూ పట్టుదలకూ నిదర్శనం
    నిత్య సంకల్పుల నెవరాపగలరు ?

    గయోపాఖ్యానములో చెప్పినట్టు

    జలనిధు లింకుగాక, కుల - శైలము లేడును గ్రుంకుగాక యా
    జ్వలనుఁడె వేఁడిమిన్ విడిచి - చల్లదనంబును దాల్చుఁగాక, యీ
    జలజ హితుండు పశ్చిమ ది - శన్ జనియించెడుఁ గాక; శంకరా
    ర్యులు, పలు పద్యముల్ గురువ - హోత్రము జేతురు సర్వధా మొగిన్ !
    (చిలకమర్తి వారికి క్షమాపణలతో)

    ఇట్లు
    శంకరయ్యగారి శిష్య పరమాణువు

    ReplyDelete
    Replies

    1. " నిత్య సంకల్పంతో నడుస్తున్న ఏకోపాధ్యాయ పాఠశాల " చక్కగా చెప్పారు.

      వసంత కిశోర్ గారు ధన్యవాదములు.

      Delete
  10. కంది శంకరయ్య మేష్టారి శంకరాభరణం పద్య సాహిత్యం పై ఆసక్తి ఉన్న ఎందరినొ పద్య కవులుగా మార్చింది. నాకున్న పద్య రచనాసక్తికి ఆయన మెరుగులు దిద్ది, ఎన్నొ మెలకువలు నేర్పారు వారి బ్లాగు ద్వారా. ఎందరో ఉద్దండ పండితులు శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారు, డాక్టర్ విష్ణునందన్ గారు, శ్రీ చింతా రామక్రుష్ణారావు గారు, కీ.శే. పండిత నేమాని రామజోగి సన్యాసిరావు గారు వంటివారు కూడా శంకరాభరణం లో తరచూ పాల్గొంటూ తమతమ అమూల్యమైన సలహాలు, పద్యాలు వ్రాస్తూ ఉంటారు. పద్య సాహిత్యానికి ఈ బ్లాగు, గురువుగారు శంకరయ్య గారు చేస్తున్న సేవ అమూల్యం.

    ReplyDelete
    Replies
    1. మిస్సన్న గారు మీరన్నట్లు శంకరాభరణం ఇంకా ఎందరో కవులను తయారు చేయాలని, ఆ దిశగా పెద్దలు కంది శంకరయ్య గారి కృషి నిరాటంకంగా కొనసాగాలని ఆశిస్తున్నాను. కామెంటుకు ధన్యవాదములు.

      Delete
  11. ఈ ఇంటర్వ్యూపై స్పందించిన మిత్రులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు నిజమే! ఇంటర్వ్యూ అసమగ్రంగా, చప్పగా ఉంది. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దాటవేశాను, కొన్నిటికి చెప్పే సామర్థ్యం లేదు. అసలే ఇంటి గొడవలతో విసిగి వృద్ధాశ్రమాన్ని ఆశ్రయించాను. పిల్లల చదువులు, పెళ్ళిళ్ళకు చేసిన అప్పుడు ఇంకా తీరుస్తూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను. ఇప్పుడు కూడా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని ‘ఆంధ్రభారతి’ వారి నిఘంటువు టైప్ చేస్తూ నెలకు ఎంతో కొంత సంపాదించవలసిన పరిస్థితి. కొన్ని క్లిష్టసమయాల్లో బ్లాగుమిత్రులు నన్ను ఆర్థికంగా ఆదుకున్నారు కూడా . వారందరికీ కృతజ్ఞతలు.

    ReplyDelete
    Replies
    1. పరిమితంగానైనా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదములు సర్. కేవలం మీ పై అభిమానంతో మాత్రమే పైన చాలామంది కొత్తవారు మీ నుండి చాలా నేర్చుకున్నామని చెప్పినవారు ప్రజ లొ తొలిసారిగా వ్యాఖ్యలు చేశారు. వారందరి లాగే ఎప్పటిలా మీరు మరింతమంది కవులను తయారు చేయాలని శంకరాభరణం బ్లాగు విజయవంతంగా కొనసాగాలని ఆశిస్తున్నాను. మీరు ఫ్రీగా ఉన్నపుడు రాజకీయాలు వంటి మీకు ఆసక్తి లేని విషయాలు వదిలేసి తెలుగు భాష , పద్యం , వ్యాకరణం వంటి అంశాలపై పాఠకుల నుండి, మీ అభిమానుల నుండి ప్రశ్నలు రాబట్టి మరోసారి సంతృప్తికరమైన ఇంటర్వ్యూ చేయాలని ఉంది.

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top