ఈ మధ్య అవినీతి, కరప్షన్ అని మాట్లాడేసుకోవటం బాగా పెద్ద ఫ్యాషన్ గా మారిపోయింది. అన్నా హజారే  గారు ఉద్యమం చేశారు. ఆయన ఢిల్లీలో కూచున్నన్నాళ్ళూ ఆయన చుట్టూ తిరిగిన వాళ్ళు టివి ల ముందు చేసిన విన్యాసాలు చూస్తే, సామాన్య ప్రజలు కూడా ఇంత నటించగలరా అనిపించింది. చివరకు, అన్నా హజారేకు అతి సన్నిహితంగా ఉన్నాయన తెగించి ఒక రాజకీయ పార్టీ పెట్టేసి, అటు దూకేశాడు. ఈ మధ్యనే డబ్బుల విషయంలో వారు అన్నాగారితో తగవు పడినట్టు కూడా మనం టి వి ల్లో చూశాము. 

అసలు అవినీతి అంటే ఏమిటి? మనం తప్ప మిగిలిన వాళ్ళల్లో ఇంకెవరో చేసేది అని ప్రతివాళ్ళూ అనుకునేదికదా!  మనం, మన బంధువులు, స్నేహితులు ఎవ్వరూ అవినీతి పనులు చెయ్యనే చెయ్యరు. కాని సమాజంలో అవినీతి పెరిగిపోతున్నది. ఎందుకని? ఎక్కడ నుంచి వస్తున్నది ఈ అవినీతి? అవినీతి ఎక్కడో లేదు. హిరణ్య కశ్యపుడు అడిగినప్పుడు ప్రహ్లాదుడు విష్ణువు గురించి పద్యం చెప్పాడు.  కాని, ఇవ్వాళ అదే పద్యాన్ని (పాపము శమించు గాక) అవినీతికి అన్వయించుకుని చూస్తే , అవినీతి అన్ని చోట్లా ఉన్నది, ఎందెందు వెతికినా అవినీతే! ఏ పనిచేసిన ఇందులో మనకు లాభం ఏమిటి అనేకాని, ఆ పని సవ్యంగా చేసి, మన ప్రతిఫలం మనం సంపాయించుకోవాలని లేదు కదా.  

అవినీతి అనంగానే, మనకు గుర్తుకు వచ్చేది రాజకీయ నాయకుల అవినీతి గురించి మాత్రమే! వాళ్ళు చెసేది మాత్రమే అవినీతా? సమాజంలో మిగిలిన అందరూ నీతిగానే బతికేస్తున్నారా! రాజకీయ నాయకుల అవినీతిని బయటకు ఈడ్చాలి, బాధ్యులైన వాళ్ళను కఠినంగా శిక్షించాలి. కాని మనలాంటి సామాన్యుల దగ్గర నడిచే అవినీతి మాటేమిటి? నిజానికి సమాజాన్ని ఎక్కువగా పట్టి పీడిస్తున్నది సామాన్య ప్రజలు చేస్తున్న అవినీతే! ఇదేమిటి, ఇలా అనేస్తున్నారు, సామాన్య ప్రజలు అవినీతి ఎలా చేస్తున్నారు అనుకుంటారేమో,  కొన్ని ఉదాహరణలు, కొన్ని మాత్రమే చెబుతాను, పరికించండి 

మొట్టమొదట అన్నిటికన్నా పెద్ద అవినీతి ప్రజల దగ్గరే ఉన్నది అదేమిటి అంటే ఓటు వెయ్యకపోవటం. ఒకవేళ వేసినా కుల ప్రాతిపదికన, మత ప్రాతిపదికన , అంతకంటే ఘోరం డబ్బులు తీసుకునో ఓటు వెయ్యటం. ఈ అవినీతి నుండి ప్రజలు బయటపడనంత వరకూ ఏ లోక్ పాల్ బిల్లూ మనను రక్షించలేదు. ఆరోజు శలవు కూడా ఇస్తున్నారు కదా, వచ్చి ఓటెయ్యటానికి ఏమి రోగం. సవ్యంగా వోటు వేసి రావటానికి కూడ సమయం లేనంతగా బిజీ బిజీగా ఉన్నామా మనమందరమూ. ప్రజలందరూ సవ్యంగా ఓటువేసి, నిజాయితీ పరుల్ని ఎన్నుకుంటే, రాజకీయాల్లో కూడా అవినీతి ఎక్కడనుంచి వస్తుంది.
సరే సవ్యంగా ఓటు వెయ్యటం అనేది పెద్ద విషయం. అతి చిన్న విషయం,  ఎక్కడన్నానలుగురికి ఒకే చోట పని ఉంటే, ఎవరూ చెప్పకుండా లైన్లో నుంచుని పని చేసుకోవటం మనకు తెలుసా!! కనీసం గొర్రెలు ఒకదాని తరువాత ఒకటి సోలుపుగా వెళ్తాయి. కాని మనం!  పెద్ద పెద్ద ఇనప కచ్చడాలు పెట్టి, ఇరుకు సొరంగాలు కడితే కాని వరుసలో నుంచోము. అక్కడకూడ ఔత్సాహికులైన, దృఢకాయులు, కొండకోచో సామాన్యంగా కనపడేవారు కూడా మన భుజాల మీదగా, నెత్తి మీదుగా నడిచి వెళ్లి వరుసలో ముందుకు వెళ్ళిపోవటం కద్దు.  బస్సు కాని రైలు కాని రావటం ఆలస్యం, ఎగబడి ఒకరికొకరు అడ్డం వస్తూ, తోసుకుంటూ ఎక్కకపోతే తృప్తి లేదు. హాయిగా ఒకరి తరువాత ఒకరు ఎక్కటం అనే క్రమశిక్షణ ఎప్పటికి నేర్చుకుంటాం. ఈ తోసుకు ఎక్కే వాళ్ళ కంటే రెండాకులు ఎక్కువ తిన్న వాళ్ళు అలా ఆ పక్కకివెళ్లి, చేతిలో పత్రికో, జేబు గుడ్డో, నెత్తిన ఉన్న కాపో లేదా గొడుగో, చేతిలో బాగ్గో, కిటికీలోంచి ఆ సీట్లోపడేసి, అందరూ భుజబలం చూపి లోపలి తోసుకు వెళ్ళినాక "ఆ చోటు నాదండీ" అంటూఅమాయకంగా వస్తారు.  ఒకవేళ కొండవీటి చాంతాడు అంత వరుస ఉంటే, ఆ మొదట్లో కిటికీ దగ్గర తచ్చాట్లాడి మెల్లిగా దూరటం లేకపోతె ఆ ముందుగా ఉన్నవాణ్ణి తన టిక్కెట్టు కూడ తీసుకోమని దేబిరించటం గొప్ప ప్రావీణ్యంగా చలామణీ అవుతున్నది. ఈ మొత్తాన్ని ఏమనాలి, ఏ బిల్లు తెచ్చి ఈ చండాలపు పన్లని  ఆపాలి. క్రమశిక్షణ కావాలి. క్రమశిక్షణ లేని సమాజం అవినీతిని ఆపలేదు. పెంచి పోషిస్తుంది. ఇలా సివిక్ సెన్స్ లేకుండా ప్రవర్తించటం, క్రమశిక్షణా రాహిత్యానికి అలవాటు పడిపోవటం చాలా పెద్ద అవినీతని నా అభిప్రాయం. 
ఎక్కడన్నా ఎర్ర లైటు దాటో, వన్-వేలో ఎదురు వెళ్ళో పోలీసు పట్టుకుంటే, సరే నాది తప్పు, ఫైన్ ఎంతో చెప్పండి కట్టేస్తాను రశీదు ఇవ్వండి అనే నీతి ఎంత మందిలో ఉన్నది. తృణమో ప్రణమో ఆ పోలీసుకు ఇచ్చేసి బయటపడదామనే తాపత్రయమే ఎక్కువ, లేదంటే, ఆ పోలీసు ఎవరు చెబితే వింటాడు  అని అలాంటివాడిని ఒడిసి పట్టుకుని ఆ పోలీసుకు ఫోను చేయించటం అద్భుతమైన తెలివి, సామర్ధ్యం కింద లెక్కకు వస్తున్నది మన సమాజంలో. ట్రాఫిక్ లైట్ దగ్గర పోలీసు లేకుంటే ఎంతమంది ఆగుతారు! ఆగుతున్నారు? పోలీసు చుట్టుపక్కల లేకపోతె ఒక్క ఆటో వాళ్ళే కాదు, ఏ సి కారు వాళ్ళు కూడ లైటు పట్టనట్టు వెళ్ళిపోతారు. ప్రతి ట్రాఫిక్ లైటు దగ్గరా పోలీసును పెట్టి ట్రాఫిక్ నియంత్రించాల్సి వస్తున్నది . దానివల్ల పోలీసు బలగాల్లో ఎక్కువ భాగం ఈ పనికే సరిపోయే. వాళ్ళు ఇక దొంగల్ని పట్టుకునేది ఎప్పుడు, నేరనిరోధం ఎలాగూ చెయ్యలేకున్నారు, నేర పరిశోధన ఎప్పుడు చేసేట్టు. అందరి దగ్గరా క్రమశిక్షణ ఉండి , కనీసం ట్రాఫిక్ నియమాలు సవ్యంగా, పోలీసు లేకపోయినా పాటించ గలిగితే ఎంతమంది పోలీసులు నేర నియంత్రణ చెయ్యటానికి మిగులుతారు. ఆలోచించాలి, తప్పదు. ఈ విషయంలో ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. మనమే, మనం అందరం పూనుకోవాలి. ట్రాఫిక్ నిబంధనలను పాటించటం అనేది కనీసంలో కనీసం, మనకోసమే, మనకు ప్రమాదాలు జరక్కుండానే, అది కూడా పాటించకుండా అవినీతి పోవాలి అని అరిచే హక్కు మనకు ఎవరిచ్చరాంటారూ!! 

నియమాలు ఉన్నాయి, అవి పాటించాలి అన్న నీతి మనలో ఉండాలి. ఆ ఆఫీసులో తెలిసినవాడు ఎవడు? మనకు అర్హత లేకపోయినా మనకు పని ఎలా అవుతుంది, ఎవడిని పట్టుకుంటే పని సులువుగా చేయించుకోవచ్చు. ఎవడికి ఇంత పెడితే ఈ పని చులాగ్గా ఇవ్వాళే చేయించుకోగలం , ఇదే ఆలోచన.     సవ్యంగా ఉన్న నియమాల ప్రకారం ప్రజలందరూ పని చేసుకు పోతుంటే, అవినీతి ఎక్కడ నుంచి వస్తుంది. మనకు అర్హత లేనిది కావాలి, ఉన్న నియమాలు పాటించ కుండా పనులు అయిపోవాలి, అవినీతి ఉండకూడదు. ఎలా? ఈ రెండూ పరస్పర విరుద్ధమైన విషయాలే! నియమాలు పాటించని ప్రజలు ఎక్కువగా ఉన్న సమాజంలో అవినీతి ఎప్పటికీ పోదు. కలకాలం నిలిచే ఉంటుంది.  అవినీతి పోగొట్టాలంటే, మనకు అవ్వవలసిన  పని కొంత ఆలస్యం అవ్వటానికి, కొన్ని పనులు కాకపోవటానికి, ఆవిధంగా జరిగే నష్టాన్ని భరించటానికి  సిద్దపడి ఉండాలి. ఇవేమీ లేకుండా, టి వి కెమెరాల ముందు ఆవేశపడితే అవినీతి పోదు, మరింత పెరుగుతుంది. కారణం శిక్షలు ఎక్కువ అవ్వటం వల్ల తీసుకునే వాడు మరింత ఎక్కువ తీసుకుంటాడు. వాడికి రిస్కు ఎక్కువ అయ్యింది కదా మరి.
మన బంధువుల్లో, తెలిసిన వాళ్ళల్లో, స్నేహితులు, ఇరుగు పొరుగుల్లో ఎవరూ అవినీతి పరులు లేరా? బంధువుల్లో ఉన్న అవినీతి అధికారులు, దొంగ వ్యాపారులని ఎవరన్నా బహిష్కరించి వాళ్ళ ఇళ్ళకు వెళ్ళకుండా ఉంటున్నారా. అలాంటి వాళ్ళ పిల్లలను సంబంధాలు చేసుకోకుండా ఉంటున్నారా? "అబ్బ మావాడా, భలే తెలివిగల వాడండీ, రెండుచేతులా సంపాదన" అనిచెప్పుకునే వాళ్ళను ఏమనాలి?! ఈ ఆలోచనా రీతి ఏ చట్టం మార్చగలదు. ఇది చట్టం చెయ్యలేనిపని. ఎవరికి వారు ఆలోచించుకుని చెయ్యాలి. 

మనకు రోజువారీగా కుటుంబీకులైన వాళ్ళల్లో కనపడేది, నలుగురూ చర్చించుకుని ఒప్పుకునే సంఘటన ఒకటి చెబుతాను. ఒక సామాన్యమైన కుటుంబంలో పెళ్ళికి ఎదిగిన కూతురు, రెండు సంబంధాలు వచ్చాయి, ఒకటి కుర్రాడు పి జి చేసి జనాభా లెక్కల కార్యాలయంలో పని చేస్తున్నాడు, మరొకడు పట్టభద్రుడు మాత్రమే కాని సేల్స్ టాక్స్ వారి చెక్ పోస్టులో పని. ఎవరైనా ఏది మంచి సంబంధం అని చేప్పుకుంటారు. ఆ రెండోదే కదా! అక్కడే ఉన్నది అవినీతికి మూలం. మన అబ్బాయి బాగా సంపాయించాలి, మన అల్లుడు  అద్భుత సంపాదన పరుడై ఉండాలి. ఉండాలి, కాని ఆ సంపాదన సవ్యమైనది, న్యాయ పరమైనది, మరొకళ్ళకు చెయ్యకూడని పనులు చేసిపెడితే వచ్చేది అయి ఉండకూడదు కదా. ఈ ఇంగితం ఎక్కడన్నా ఉన్నదంటారా. ఎక్కడనుంచి వస్తుంది ఇలాటి సామాన్యమైన తెలివి, ఒక పక్క మాది ఘొప్ప, అద్భుతమైన పత్రిక, ఎక్కడ అవినీతి ఉన్నా పట్టేసి చూపిస్తాం అని ఒక్క పార్టీ మీద మాత్రమే దాడిచేసి, సుభాషితాలు వల్లించిన తెహల్కా తేజ్పాల్ చేసిన పనేమిటి? ఇన్నాళ్ళూ మహిళా ఉద్యమమే కర్తవ్యం అని చెప్పుకుని తెగ వ్రాసిన ఆయన గారి అసిస్టెంట్ షోమా చౌదరమ్మ గారు చేసినది ఏమిటి!  ఇలాంటి ద్వంద్వ ప్రవర్తనే, మన సమాజంలో అవినీతికి మూలం, పునాది కూడా. 

మన కళ్ళ ముందు జరిగే అవినీతి, మనం పనిచేసే చోట జరిగే అవినీతి "విజిల్ బ్లోయర్" చేసి అన్నా ఆపగలిగే ధైర్యం ఎంతమందిలో ఉన్నది? గుంపులో గోవిందగా ఎవరికో జైకొట్టుకుంటూ తిరిగేయ్యగలం, కాని మన ఒక్కళ్ళమే కనీసం అజ్ఞాతంగానన్నా జరిగే అవినీతిబయట పెట్టటంలో మనవంతు కృషి చెయ్యగలమా! ఆలోచించుకోవాలి. ఆఫీసుల్లో పని చెయ్యకుండా బాతాఖానీతో కాలం గడపటం . ఉద్యోగం వచ్చేవరకూ ఒక గోల. ఉద్యోగం వచ్చిన తరువాత ప్రమోషన్ రాలేదని. పనిచేసేప్పుడు మనసు పెట్టి ఇచ్చిన పని సవ్యంగా చేసే వాళ్ళు ఎంతమంది? ఉద్యోగంలో "కరీర్ ఓరియంటేషన్" పేరుతొ సకల గడ్డీ కరవటం, చెయ్యకూడని పనులు చెయ్యటం అవినీతి కాదూ. వీటితో వచ్చే ఒత్తిడికి బి పిలు షుగర్లు తెచ్చుకోవటం. ఇదేనా మనకు మన పూర్వీకులు నేర్పినది!

చేసే వ్యాపారాల్లో కల్తీ, నాణ్యం లేని వస్తువులను అంటగట్టటం ఎటువంటి నీతి? ప్రతి వాడి దగ్గరకూ వెళ్లి తనిఖీ చేసి ఎవరు ఆపగలరు. ఆ వచ్చినవాడికి "ఆమ్యామ్యా" ఇచ్చేసి పంపటం, వాడు తీసుకోకుండా కేసు వ్రాస్తే, వాడి పైవాడి మరికొంత ఎక్కువ పారేసి కేసు మాఫీ చేయించుకోవటం, ఇదంతా నీతేనా? కాదు నాణానికి మరో పక్కన ఉన్న దృశ్యం. అది కూడ చూడాలి, తప్పదు.  నిజాయితీ లేని వ్యాపార ప్రకటనలు గుప్పించి ప్రజలను బ్రెయిన్ వాష్ చేసేయ్యటం, వాళ్ళను తోచుకో నివ్వకుండా, తమ వస్తువే కోనేట్టుగా చేసే వ్యాపార ప్రకటనలూ ఈ అవినీతిలో భాగమే. 
అవినీతి అనంగానే రాజకీయ నాయకుల తరువాత గుర్తుకు వచ్చేది, ఉద్యోగులు. అది కూడా కొన్ని కొన్ని డిపార్ట్‌మెంట్ల ఉద్యోగులు ఎక్కువగా గుర్తుకు వస్తారు. ఈ అవినీతి అంతా కూడా  ఒక్క లంచాలు పట్టే ఉద్యోగులదేనా? ఒక ముఖ్యమైన విషయం, అవినీతి నిర్మూలనలో భాగంగా, ఒక లంచగొండిని పట్టుకున్నప్పుడు, సదరు మనిషి సంపాయించిన ఆస్తులు కొనటానికి, ఎవరెవరు లంచాలు ఇచ్చారు, అలా లంచం ఇచ్చి పనులు చేయించుకుని వాళ్ళు ఎంత లాభపడ్డారు అన్న విషయం కూడా వెలికి లాగి, అలా లంచాలు ఇచ్చిన వాళ్లకు కూడా కఠిన శిక్షలు వేసి, లంచాలు ఇచ్చి, తద్వారా సంపాయించుకున్న ఆస్తులను జప్తు చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చెయ్యాలి. ఇదంతా చెయ్యగలిగినది ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం దొరకనంత వరకూ, అవినీతిని అంతం చెయ్యటం అసాధ్యం.

రాజకీయ నాయకులు, ఉద్యోగాలు చేసేవారు మాత్రమే అవినీతిని ప్రోత్సహించేవారా! వ్యాపారం చేసే వారు, దొంగ లెక్కలు వ్రాసిపెట్టేవాళ్ళు, ఆ దొంగ లెక్కలకు సర్టిఫికేట్ ఇచ్చే వాళ్ళు చేసేది అంతా నీతే. వీళ్ళను పట్టుకునే వాళ్ళు ఏరి! లంచం ఇచ్చేవాడు లేకపోతె అవినీతి ఎక్కడ నుంచి వస్తుంది. పది రూపాయలు ఒకడు లంచం ఇచ్చాడు అంటే, వాడికి ఆ పదిరూపాయల కంటే వెయ్యి రెట్లు లాభం లేకుండా ఇవ్వడు. ఆ లాభం పాటించవలసిన నియమాలు పాటిస్తే రాదు. అందుకని లంచంతో ఆ నియమాలను పాటించకుండా అధిగమించటం. ఇది తగ్గాలి ముందు. అవినీతి నిరోధక శాఖ వారు లంచాలు ఇవ్వచూపే ప్రభుద్దుల్ని కూడ వల పన్ని పట్టుకుని జైళ్ళల్లో పారెయ్యటం మొదలు పెట్టాలి. కాని అవినీతి నిరోధక శాఖలో అందరూ నీతిమంతులేనా!

కోడి గుడ్డుకు ఈకలు పీకుతూ, కేసుల్ని ఏళ్లకు ఏళ్ళు నడిపి బతికే లాయర్లు చేసేది ఏమిటి, నీతే! చెత్తా చెదారం పోగేసి వార్తల పేరిట, సంపాదకీయాల పేరిట వ్రాయటం, డబ్బులు పుచ్చుకుని ఏదో ఒక పార్టీకో, వ్యక్తికో అమ్ముడుపోయి పేపర్లు, చానెళ్ళు నడిపే వాళ్ళను ఏమనాలి. వాళ్ళు చేసేదీ నీతిమంతమైన పనే? విదేశీ ఇజాలు ఇక్కడ మప్పటానికి పేపరు పేరుతొ నడిపే కరపత్రాల మాట ఏమిటి? మనం పుట్టి పెరిగిన దేశాన్ని వదిలి విదేశ ఇజాల పిచ్చిలో పడి వాళ్ళు చేసే పనులు కూడా నీతి కిందకే వస్తాయా?

ఇంకా ఇంకా  ఇంకా అనేకం:- మన దొడ్లో చెత్త వేరే వాళ్ళ వాకిట్లోకి తోయ్యటం, నో పార్కింగ్ అన్న చోట నిర్భీతిగా వాహనాన్ని సైడు స్టాండు వేసి మరీ పార్కింగ్ చేసేయ్యటం, ఏమిరా అంటే అడ్డంగా వాదించటం, ఎట్టాపడితే అలా వాహన చోదకం, సమయ పాలన చెయ్యకపోవటం, వద్దన్న పనులే చెయ్యటం (బాహాటంగా పొగ తాగటం, మద్యం సేవించటం, వాహనం నడుపుతూ ఫోన్ మాట్లాడటం), ఎవరన్న గౌరవం లేకుండా దురుసుగా ప్రవర్తించటం, నలుగురిలో లేకితనపు మాటలు మాట్లాడటం ఇలా చెప్పుకుంటూ పొతే సవాలక్ష.
అవినీతి పోవటానికి అదేదో లోక్ పాల్ బిల్లుట,  అదివస్తే సకల రోగ నివారిణిట, ఇక అవినీతి ఉండదట. ఇప్పటికే ఉన్న చట్టాల గురించి చూద్దాం. వరకట్న దురాచారం గురించిన చట్టం చేసి కొన్ని దశాబ్దాలు అయినాయి. కట్నం తీసుకోవటం మానారా! ఇందులో రాజకీయ నాయకుల ప్రమేయం ఏమున్నది, ప్రధాన మంత్రి అవినీతి ఏమున్నది. అంతా "మనం-మనం" సాంప్రదాయం పేరిట చేసే పనే కదా. చట్టం తేవటం వల్ల ఈ దురాచారం ఎంతవరకు తగ్గింది?అవినీతి నిరోధక చట్టాలు అనేకం. ప్రతిరోజూ, పిల్ల చేపల్ని పట్టుకుని విజయోత్సాహంతో ఆ ఏసిబి వారి వార్తలు. నాకు ఎప్పుడూ ఆశ్చర్యమే, ఎన్నడు చూసినా ఒక స్కూల్ హెడ్మాస్టర్ నో, ఎలెక్ట్రిసిటీ లైన్ మాన్ నో "వల పన్ని" చాలా సాహసం చూపి పట్టుకుంటారు. పై అధికారుల్ని ఎందుకు పట్టుకోరు? పై అధికారులలో అవినీతే లేదా!

కాసేపు అనుకుందాం, లోక్ పాల్ బిల్లు వచ్చేసింది, అందులో ప్రధాని పదవిలో ఉండే వారిని కూడా ఆ లోక్ పాల్ పరిధిలోకి తెచ్చారు. అంటే ఆ ఒక్క విషయంతో అవినీతి అంతా అణగారిపోతుందా! ముళ్ళపూడి వెంకట రమణ గారు ఒక కథలో వ్రాస్తారు, ఒక ఊళ్ళో అందరి కంటే వినయం కలవాడికి సన్మానం చేద్దామని నిర్ణయిస్తారు. ఎవరికి చెయ్యాలి, అని దుర్భిణి వేసి వెతికి ఒకాయన్ని పట్టుకు వస్తారు. ఈ సన్మాన కార్యక్రమం మొదలు కాకముందే ఆయనికి కొమ్ములు మొలవటం ప్రారంభిస్తాయి. మరోకాయాన్ని పట్టుకు వస్తారు, సభకు వస్తూ ఉండగానే ఆయనకు తలలో ముందు బొడిపెలు, సభలో ప్రవేశించెప్పట్టికి, దుప్పికి ఉన్నట్టు కొమ్ములు మొలుచుకు వస్తాయి. నాకు చెప్పటం చేతకావటం లేదు కాని, ముళ్ళపూడివారు, ఆ కథలో మన సమాజంలో వినయం ఎంతగా మృగ్యం అయిపోయిందో అన్న బాధాకరమైన విషయం తన హాస్య బాణాలతో అద్భుతంగా వివరించారు. ఆయన వ్రాసిన విషయం కేవలం నవ్వుకోవటానికే అని, చాలా మంది ఉద్దేశ్యం. అందుకనే ఆయన్ను హాస్య రచయితగా మాత్రమె పరిగణిస్తున్నారు. కాని, ముళ్ళపూడి వారి అసలు ఉద్దేశ్యాన్ని గ్రహించ గలిగినది ఎంతమంది! వామపక్ష సిద్ధాంతాలు "వల్లే" వేస్తేనే కాని సామాజిక స్పృహ  ఉన్నట్టు కాదట మరి, ఖర్మ! విదేశీ ఇజాల పిచ్చి.

ఈ లోక్ పాల్ విషయంలో కూడా, ఇప్పటికే ఉన్న అనేక చట్టాల విషయంలో జరిగినదే  జరుగుతుందా అని నా అనుమానం. లోక్ పాల్ నియామకం జరిగాక, సదరు వ్యక్తీ న్యాయ వర్తనుడిగాఉంటాడా, ఉండగలడా, ఉండనిస్తారా!? మన దేశంలోని సర్వోత్తమ న్యాయ స్థానంలోని చీఫ్ జస్టిస్ కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటూ ఉంటే, ఎవరిని తెచ్చి లోక్ పాల్ చెయ్యాలి. హిమాలయాల్లోతపస్సు చేసుకుంటున్న, స్వాముల వారినా. అటువంటి స్వామీజీ ఉన్నా, రెండురోజుల్లో అవినీతి మప్పేస్తారు చుట్టూఉన్న వాళ్ళు. నెల తిరక్క ముందే, గడ్డం-గిడ్డం తీసేసి, మంచి సూటులో రేబాన్ కళ్ళద్దాలతో కనిపిస్తాడు. వృద్ధ నారీ పతివ్రతః అని ఒక నానుడి ఉన్నది. అదే విధంగా సమాజంలో అవినీతికి పాలుబడటానికి ఆవకాశం లేని వాళ్ళందరూ అవినీతి అంతం కావాలని ఆవేశపడుతున్నారు. ఆవకాశం వచ్చిన రోజున అవినీతికి పాలుబడని వాళ్ళు ఎవరు, ముళ్ళపూడి గారి కథలో ఆయన బాధపడింది ఈ విషయమే.

అవినీతి సమాజంలోని అందరిలోనూ ఉన్నది. అతి చిన్న విషయాల్లో కూడా క్రమశిక్షణ పాటించ లేమే! మనమా అవినీతిని అంతం చెయ్యగలిగేది. ఎవరో లక్షలో ఒక్కరు రెండు చేతులా సంపాయించుకోవటానికి ఆవకాశం ఉండి కూడా, లంచాలు పట్టకుండా,  జీతంమీద మాత్రమె ఆధార పడి జీవించే వారు ఉండి లాభం ఏమిటి. అందరూ అలా ఉండగలిగితేనే కదా సమాజం మొత్తం నీతిమంతంగా ఉండి, ప్రభుత్వ పధకాలు అన్ని సవ్యంగా అమలయ్యి, అందరికీ ఆధరువు దొరికే అవకాశం ఉండేది. 

ఏ స్తంభాన్ని అయినా కింద నుంచి పైకి కట్టగలం కానీ, పైనుంచి కిందకు కట్టలేము. అలాగే అవినీతి మీద యుద్ధం సమాజంలో కింది నుండి రావాలి. పూర్వం శంకర్స్ వీక్లీ అని పూర్తి రాజకీయ వ్యంగ్య చిత్రాల పత్రిక ఉండేది. అందులో అప్పటి ప్రధాని పంచవర్ష ప్రణాళికల గురించి పూనకం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటే, ఒక చక్కటి కార్టూన్ వేశారు శంకర్ గారు. మన దేశ సార్వభౌమత్వానికి గుర్తైన మూడు సింహాల విగ్రహాన్ని పైకి ఎత్తి పరంజాలతో (Scaffoldings) కట్టి ఉంచి ఆ విగ్రహాన్ని ఉంచటానికి పీఠాన్ని కిందకు కట్టే ప్రయత్నిస్తున్న నెహ్రూ కనిపిస్తారు. అంటించే ఇటుక అంటిస్తూ ఉండగా, కింద పడిపోయ్యే ఇటుక పడిపోతూ ఉంటుంది.
మనకు, మన పనులు వెంట-వెంటనే అయిపోవాలి, మనం నియమాలు పాటించం, ఎవడినో ఒకడిని పట్టుకుని, ఎంత ఖర్చైనా సరే పనులు చేయించుకోవటం మానము. కాని అవినీతి పోవాలి. ఎలాపోతుంది!
అవినీతి పోవాలంటే సమాజంలో క్రమశిక్షణ ఉండాలి క్రమశిక్షణ లేని సమాజం అవినీతి నిర్మూలన చెయ్యలేదు.

అవినీతి నిర్మూలనకు ఒక తరం మొత్తం త్యాగాలు చెయ్యటానికి సిద్ధం కావాలి. ఎవరికి కావాలిసిన పనులు వాళ్ళు లంచం ఇవ్వకుండా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఎదుర్కొని తమకు కావలసినవి సంపాయించుకునే మానసిక స్థైర్యం, ఓపిక కావాలి. అలా చేసినప్పుడు జరిగే నష్టాలను భరించి ఉండగల శక్తి ఉండాలి.  అది లేని నాడు, ఈలోక్ పాల్ బిల్లు కాదుకదా ఆ దేముడే దిగి వచ్చినా అవినీతి పోదు. చెత్త సినిమాలు ఎందుకు వస్తున్నాయిరా అంటే,చూసేవాళ్ళు చూస్తున్నారు కాబట్టి. చెత్త సినిమాలు వందరోజులు ఎందుకు ఆడిస్తున్నారురా అంటే, అంతకంటే సినిమాలు రావట్లేదు కాబట్టి. అలాగే లంచాలు ఎందుకు తింటున్నారు అంటే, ఇచ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి. లంచాలు ఎందుకు ఇస్తున్నారు అంటే, ఇస్తే కాని పని కావటం లేదు కాబట్టి. పిచ్చి కుదిరితే కాని పెళ్లి కుదరదు. పెళ్లి ఐతే కాని పిచ్చి కుదరదు. పూర్తిగా కాచ్ 22 పరిస్థితి. ఇదే మన్ని పట్టి పీడిస్తున్న విషయం. 
 మన ఆలోచనా విధానంలో మార్పు రావాలి. ఊరికే ఇంకెవరో అవినీతిపరులన్నట్టుగా ఆవేశపడటం తగ్గించి మనలోనే పొంచి ఉన్న అవినీతిని గుర్తించి (ముందు గుర్తించటం ఎంతో ముఖ్యం, అది లేనట్టుగా ఉండటం కల్తీ లేని నటన) అటువంటిఆలోచనలు పోగొట్టుకోవటానికి కృషి చెయ్యాలి. అప్పుడే మనం అవినీతి గురించి మాట్లాడటానికి అర్హులం. అటువంటి ఇంగితం లేనప్పుడు, అవినీతి గురించి మాట్లాడటం ఇచ్చకాలే కాని మరేమీ కాదు. మొత్తంమొత్తం మీద, మనిషిలో దురాశే అవినీతికి మూలం. మనకు అర్హత లేనివి సంపాయించాలన్న తపన, అవినీతికి పునాది. ఈ పునాదులను పగలగొట్టాలి. ప్రజలందరిలోనూ మార్పు రావాలి. అది చట్టాలతోనూ, బిల్లులతోనూ రాదనీ నా అభిప్రాయం.  

(ఈ వ్యాసంలో ప్రచురించబడిన కార్టూన్లు ప్రముఖ వ్యంగ్య చిత్రకారులు శ్రీ కొలను దుర్గాప్రసాదు గారు వేసినవి. వారి అనుమతితో ఇక్కడ ఆ కార్టూన్ల ప్రచురణ జరిగింది. దుర్గా ప్రసాద్ గారు,"బాబు" అన్న పేరుతో గత ఐదు దశాబ్దాలనుండి కార్టూన్లు వేస్తున్నారు. వారు తమ బ్లాగును కూడా నిర్వహిస్తున్నారు  http://babucartoon.blogspot.in/)

- శివరామప్రసాదు కప్పగంతు
--------------------------------------------------
*Republished

మీరూ జనవిజయం శీర్షిక కు రచనలు పంపవచ్చు. మెయిల్ ఐ.డి : janavijayam@gmail.com

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top